పౌరుల మిస్సింగ్ డేటా సేకరించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో చేపట్టిన హౌస్ హోల్డ్ సర్వే ద్వారా పౌరుల మిస్సింగ్ డేటా సేకరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ఈ సర్వేను వారం రోజుల్లో పూర్తి చేసి, పౌరుల మిస్సింగ్ డేటా డేటాబేస్‌లో చేర్చాలని సూచించారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది హాజరును తప్పక నమోదుచేసేలా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న హౌస్ హోల్డ్ సర్వే ప్రగతిపై కలెక్టరేట్ నుంచి కలెక్టర్ లక్ష్మీశ బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ప్రతి పౌరుడి సమగ్ర సమాచారం డేటాబేస్‌లో పొందుపరిచేందుకు హౌస్ హోల్డ్ సర్వే చేస్తున్నామని పేర్కొన్నారు. దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారు, సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్నవారు డేటాబేస్‌లో నమోదుచేసుకున్నారని, ఉద్యోగులు, వ్యాపార రంగానికి చెంది దారిద్య్రరేఖకు పైబడినవారు సంక్షేమ పథకాలు అర్హులు కాదనే ఉద్దేశంతో తమ వివరాలను మ్యాపింగ్ చేసుకోలేదని వివరించారు. సచివాలయ సిబ్బంది తమ పరిధి లోని ప్రతి ఇంటినీ సందర్శించి కుటుంబ యజమానితో పాటు సభ్యుల వివరాలను సేకరించి నమోదుకాని వారి డేటాను పొందుపరచాలని స్పష్టంచేశారు. ప్రస్తుతం జిల్లాలో 7,28,383 గృహాలకు 6,91,627 గృహాల జియో ట్యాగింగ్ చేశారని తెలిపారు. మిగిలిన 36,756 ఇళ్లకు జియో టాగింగ్ చేయాలని సూచించారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు సామజిక ప్రయోజనా లను అందేలా వారి ఆధార్‌ను బ్యాంకు ఖాతా లతో అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో జిల్లా గ్రామ/వార్డు సచివాలయ అధికారి జి.జ్యోతి, వివిధ మండల అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment