సాగర సంగమాన్ని అభివృద్ధి చేయాలని వినతి
అవనిగడ్డ: కృష్ణానది సంగమ ప్రాంతమైన సాగరసంగమంను ఎకో టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని డెప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కోరినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళగిరి క్యాంపు కార్యాలయంలో డెప్యూటీ సీఎంను కలసి ప్రపంచ తెలుగు మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానం పలికానని పేర్కొన్నారు. పాత ఎడ్లంక బ్రిడ్జిని నిర్మించాలని కోరడంతోపాటు, ఎదురుమొండి – గొల్లమంద రహదారికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు ఎమ్మెల్యే చెప్పారు.
పారదర్శకంగా ఫెన్సింగ్ పోటీలు
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళలు, పురుషుల ఫెన్సింగ్ పోటీలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఫెన్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి జి.ఎస్.వి.కృష్ణమోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఖరీదైన ఎలక్ట్రానిక్ పరికరాలు రాష్ట్రంలో అందుబాటులో లేనందున గతంలో పోటీలను మాన్యువల్‌గా నిర్వహించామని, దీనివల్ల అసో సియేషన్ ఆరోపణలు ఎదుర్కొందని గుర్తుచేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను అద్దెకు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో ఫెన్సింగ్ క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు, క్రీడాకారులకు సమాన అవకాశాలు కల్పించేందుకు, కచ్చితమైన ఫలితాలు వెల్లడించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతిభ ఉన్న ఫెన్సింగ్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కృష్ణానదిలో వ్యక్తి మృతదేహం
తాడేపల్లి రూరల్: కృష్ణానది పుష్కర ఘాట్ వద్ద మృతదేహం లభ్యంది. మృతుడిని పెనమలూరు మండలం కానూరు గ్రామంగా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. బుధవారం రాత్రి కృష్ణా నదిలో మృతదేహం ఉందన్న సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని వెలికి తీయించి, తాడేపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నది ఒడ్డున నిలిపిన ఆటోను పోలీసులు పరిశీలించగా రామకృష్ణ పేరుతో ఆధార్ కార్డు లభించింది. దాని ఆధారంగా ఆ వ్యక్తిది పెనమలూరు మండలం కానూరు గ్రామంగా గుర్తించారు. ఆటోలో బ్యాంక్ పాసు పుస్తకం, ఫోన్ లభించాయని, ఫోన్‌లో కాంటాక్ట్ నంబర్లను పోలీసులు సంప్రదించగా ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేదు. బ్యాంక్ పాసుపుస్తకంలో ఉన్న అడ్రస్, ఆటో సీ బుక్‌లో చిరునామాలు వేరువేరుగా ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేసి రామకృష్ణ మృతికి కారణాలు తెలుసుకుంటామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment