వైద్యం వికటించి వ్యక్తి మృతి!
హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన
రామవరప్పాడు: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓవ్యక్తి మృతి చెందాడంటూ అతని బంధువులు వైద్యశాల వద్ద ఆందోళనకు దిగిన ఘటన విజయవాడరూరల్ మండలం ఎనికేపాడులో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... ఆగిరిపల్లి మండలం వడ్లమానుకు చెందిన రెడ్డి వెంకటేశ్వరరావు (49) బాపులపాడు మల్లవల్లిలో లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతనెలలో హనుమాన్‌జంక్షన్ సమీపంలో జరిగిన ప్రమాదంలో వెంకటేశ్వరరావుకు తలకు తీవ్రగాయాలు కావడంతో ఎనికేపాడులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్సపొందుతున్న రెడ్డి వెంకటేశ్వరరావును ఈనెల 21న డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ సిబ్బంది తెలిపారని, ఈనేపథ్యంలో వెంకటేశ్వరరావుకు వైద్యసిబ్బంది ఓ ఇంజెక్షన్‌కు మరో ఇంజెక్షన్ ఇవ్వడంతో అతని ప్రాణాలు పోయాయని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. వెంకటేశ్వరరావును చూడాలని కోరగా ఆయన ఉన్న గదికి తాళాలు వేసిన వైద్యసిబ్బంది, మిగతా బ్యాలెన్స్ డబ్బులు చెల్లిస్తే తప్ప అనుమతించమని దౌర్జన్యం చేశారని వారు వాపోయారు. వైద్యఖర్చుల కింద ఇప్పటికే రూ.30లక్షలను ఆస్పత్రి యాజమాన్యానికి చెల్లించామని తెలిపారు. వైద్యం వికటించినందునే వెంకటేశ్వరరావు చెందాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆదివారం ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment