జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కొత్త సంవత్సరంలో నూతన ఒరవడితో నిర్మాణాత్మక అభివృద్ధికి చేసే కృషిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, సమష్టి భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దామని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. క్యాంపు కార్యాలయంలోని వీసీ హాల్లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా సమగ్రాభివృద్దికి కొత్త సంవత్సరంలో చేపట్టనున్న కార్యక్రమాల గురించి వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కీలక భాగస్వామ్యంతో బుడమేరు వరదల సమయంలో చేసిన కృషి మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. సహాయ చర్యలతో పాటు ఆర్థిక సహాయ పంపిణీ వరకు బాధితులకు అండగా నిలిచామన్నారు. ఇదేవిధంగా కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు ఎన్టీఆర్ జిల్లా
యంత్రాంగం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో 15 శాతం సగటు వృద్ధికి ఇప్పటికే అధికారులను సన్నద్ధం చేసినట్లు వివరించారు. పారిశ్రామికవృద్ధితో పాటు పెద్దఎత్తున ఉపాధి
సృష్టికి వీలు కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
టూరిజం హబ్‌గా
సేవా రంగం వృద్ధిలో భాగంగా జిల్లాను టూరిజం హబ్‌గా మార్చేందుకు కృషిచేస్తున్నామని.. కొత్త టూరిజం ప్యాకేజీ రూపకల్పనకు భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. పర్యాటక గైడ్లు ఏర్పాటు వంటి ప్రయోగాత్మక కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అమరావతికి ముఖద్వారమైన విజయవాడను స్వచ్ఛ, హరిత, పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు వివరించారు. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఎన్‌జీవోలు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ల ప్రతినిధులు తదితరుల సూచనలు, ఫీడ్‌బ్యాక్ తీసుకునేందుకు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం...
ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ, పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. కొత్త సంవత్సరంలో ఇదే పంథా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనం తప్పక అందుతుందని తెలిపారు. నైపుణ్యాభివృధ్ది, ఉపాధి కల్పనను అనుసంధానం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. మీడియా నిర్మాణాత్మక సూచనలు చేస్తూ జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment