ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): అర్జీల రూపంలో వచ్చే ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో నమోదయ్యే అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గడువులోగా పరిష్కరించి ప్రజలు సంతృప్తి చెందేలా చూడాలన్నారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో మొత్తం 70 అర్జీలు అందాయన్నారు. వీటిలో రెవెన్యూ 25, మున్సిపల్ 13, పోలీస్ 6, విద్య 5, పంచాయతీరాజ్ 4, డీఆర్‌డీఏకు 3 అర్జీలురాగా ఏపీసీపీడీసీఎల్, మైన్స్ అండ్ జియాలజీ, గ్రామీణ నీటి సరఫరా విభాగాలకు రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. ఆరోగ్యం, వ్యవసాయం, గృహ నిర్మాణం, పొల్యూషన్, ఉపాధి కల్పన, సర్వే అండ్ సెటిల్‌మెంట్, పశు
సంవర్థక, పారిశ్రామిక శాఖలకు ఒక్కో అర్జీ వచ్చాయి. కొత్తూరు తాడేపల్లి పరిధిలో పోలవరం కాలువ కట్టపై మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని జమలయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. జేసీబీలతో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమంగా మట్టి తరలించేవారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. మట్టిని అక్రమంగా తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, డీఆర్‌వో ఎం.లక్ష్మీ నరసింహం, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి పి.జ్యోతి, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment