సూర్య ఘర్ రిజిస్ట్రేషన్ వారంలోగా పూర్తి చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం ద్వారా రెండు లక్షల గృహాలకు సౌర విద్యుత్ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ మేరకు రిజి స్ట్రేషన్ ప్రక్రియను వారం రోజుల లోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్ కార్యాలయం నుంచి శుక్రవారం ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ కనెక్షన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 45 వేల మంది సౌర విద్యుత్ కనెక్షన్ కోసం పేర్లను నమోదు చేసుకున్నారన్నారు. ఇందులో 35 వేలు గ్రామీణ ప్రాంతంలో, 10 వేలు పట్టణ ప్రాంతంలో ఉన్నాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ పథకంలో ప్రభుత్వం ఇస్తున్న రాయితీ, సూర్యఘర్ ప్రయోజనాలు ప్రజలకు వివరించాలని సూచించారు. రూ.2 లక్షల విలువైన 3 కేడబ్ల్యూ సోలార్ ప్యానెల్‌ను ఓసీ, బీసీ వర్గాలకు చెందిన స్వయం సహాయక బృందాలు రూ.78 వేల రాయితీతో పొందవచ్చన్నారు. రూ.20 వేలు లబ్ధిదారు వాటా పోను మిగిలిన మొత్తాన్ని తక్కువ వడ్డీతో బ్యాంకులు రుణంగా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి పూర్తి రాయితీతో సౌర విద్యుత్ కనెక్షన్లు పొందే అవకాశం ఉందన్నారు. లక్ష్య సాధనలో స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం కీలకమన్నారు. అధికార యంత్రాంగం పరంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఏ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.శ్రీనివాసరావు, జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఎ.మురళీమోహన్, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ విద్యుత్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
2 లక్షల గృహాలకు సౌర విద్యుత్ కనెక్షన్లు లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment