జీజీహెచ్‌లో నూతన పరికరాల ఆవిష్కరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలోని ఈఎన్‌టీ విభాగంలో అందుబాటులోకి వచ్చిన పలు పరికరాలను శుక్రవారం సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పి.అశోక్‌కుమార్, సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. అందులో భాగంగా ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ, హార్మోనిక్ స్కాల్ పెల్, అడ్వాన్స్‌డ్ కాట్రే ఇంఫిడెన్స్ ఆడియో మెట్రీ వంటి పరికరాలను ఆవిష్కరించారు. ఇవి రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్ కొణిదె రవి మాట్లాడుతూ స్వరపేటిక సమస్యలు, గొంతు క్యాన్సర్ వంటి వాటికి ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ, ధైరాయిడ్ ఆపరేషన్లు స్వరపేటిక క్యాన్సర్ సర్జరీలకు హార్మోనిక్ స్కాల్ పెల్‌లు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ సొంగా వినయ్‌కుమార్, టి.లీలాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సులో
ప్రయాణికుడి మృతి
కోనేరుసెంటర్: ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు మండలం పిండి వారి పాలెం గ్రామానికి చెందిన సిరివెళ్ల వెంకటేశ్వరరావు (70) కొన్ని రోజుల క్రితం బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం బంధువులతో కలిసి విజయవాడ వెళ్లేందుకు మచిలీపట్నం చేరుకున్నాడు. మచిలీపట్నంలో విజయవాడ నాన్ స్టాప్ బస్సు ఎక్కి కూర్చున్న సమయంలో మళ్లీ గుండెపోటు వచ్చింది. కూర్చున్న సీటులోనే వెంకటేశ్వరరావు తలవాల్చేయడంతో కంగారు పడిన బంధువులు పెద్దగా కేకలు పెట్టారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని వెంకటేశ్వరరావు పరిస్థితిని పరిశీలించారు.అదే బస్సులో ఉన్న ఓ వైద్యుడు వెంకటేశ్వరరావుకు వైద్య పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు తెలియజేశారు. బంధువులు మచిలీపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా వారు కూడా వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం బంధువులు వెంకటేశ్వరరావు మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఆయన స్వగ్రామానికి తరలించారు.
ఇద్దరు డీఎస్పీలకు స్థానచలనం
కోనేరు సెంటర్(మచిలీపట్నం): జిల్లాలో ఇద్దరు డీఎస్పీలకు పోస్టింగ్‌లు కల్పిస్తూ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. బందరు డీఎస్పీగా చప్పిడి రాజా, గుడివాడ డీఎస్పీగా వి.ధీరజ్ వినీల్‌లను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment