దుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో సంక్రాంతి రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తుల రద్దీ కనిపించింది. ఈ నేపథ్యంలో కొండపైకి ద్విచక్ర వాహనాలు, దేవస్థాన బస్సులు మినహా ఇతర వాహనాలను అనుమతించలేదు. దీంతో భక్తులు తమ వాహనాలను హెడ్ వాటర్ వర్‌ుక్స, సీతమ్మ వారి పాదాలు, వీఎంసీ కార్యాలయం, కెనాల్‌రోడ్డులో నిలుపుకొని మహా మండపం ద్వారా కొండపైకి చేరుకున్నారు. దుర్గాఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఘాట్‌రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్నారు. మహా మండపం మీదుగా వచ్చే భక్తులను 5వ అంతస్తులో దించి అక్కడి నుంచి క్యూలైన్‌లోకి మళ్లించారు. సర్వ దర్శనం క్యూలైన్‌లో అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. మరో వైపు అమ్మవారికి నిర్వహించిన ఆర్జిత సేవల్లోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీ చక్ర నవార్చన, చండీహోమం, శాంతి కల్యాణంలో విశేషంగా పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. సాయంత్రం పంచహారతుల సేవ, పల్లకీ సేవల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పల్లకీ సేవలో భక్తులు పాల్గొని ఉత్సవ మూర్తులతో పాటు అమ్మవారి ఆలయం చుట్టూ మూడు పర్యాయాలు ప్రదక్షిణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment