గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గుణదల మేరీ మాత ఉత్సవాలు ఈ నెల 9, 10, 11 తేదీల్లో నిర్వహిస్తున్నారని, సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని విజయవాడ ఆర్డీవో కె.చైతన్య అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గుణదల మేరీమాత ఉత్సవాలపై రెవెన్యూ, పోలీస్, విజయవాడ నగర పాలక సంస్థ, వైద్య ఆరోగ్యం, ప్రజా రవాణా, విద్యుత్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులతో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో కె.చైతన్య మాట్లాడుతూ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి ఆరు లక్షల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. మూడు షిప్టుల్లో పనిచేసేలా సమన్వయ శాఖలతో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య శిబిరాల నిర్వహణ, భక్తుల కోసం రైల్వే, బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటు, వాహనాల పార్కింగ్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీసీపీ కేజీవీ సరిత తెలిపారు. సీసీటీవీలు, డ్రోన్లతో సహా ఆధునిక సాంకేతికతను ఉపయోగించనున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలీస్ అవుట్‌పోస్టును ఏర్పాటుచేసి నిరంతర పర్యవేక్షణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, సెంట్రల్ డివిజన్ ఏసీపీ కె.దామోదర్‌రావు, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, రెక్టార్ వై.జయరాజు, ఫాదర్ ప్రసాద్, ఫాదర్ బాలయేసు, ఫాదర్ గాబ్రియేల్, ఫాదర్ జాన్ పీటర్, మాచవరం సీఐ ప్రకాష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment