తారలు దిగి వచ్చిన వేళ..! | Sakshi
Sakshi News home page

తారలు దిగి వచ్చిన వేళ..!

Published Sun, Apr 14 2024 12:55 AM

నవీన్‌ నివాస్‌ వైపు వెళ్తున్న ఓలీవుడ్‌ తారలు  - Sakshi

వ్యూహాత్మకంగా బీజేడీ కార్యాచరణ

ఏం జరుగుతుందోనని ఆశావాదుల్లో ఉత్కంఠ

భువనేశ్వర్‌: సార్వత్రిక ఎన్నికలకు బిజూ జనతా దళ్‌ అధిష్టానం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. నామినేషన్ల ఘట్టం సమీపిస్తున్నా ఇంత వరకు పూర్తిస్థాయి అభ్యర్థుల జాబితా ఖరారు కాలేదు. విడతల వారీగా అభ్యర్థుల్ని ఖరారు చేస్తూనే మరోవైపు ప్రచార పర్వాన్ని పకడ్బందీగా రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో అసమ్మతి ప్రేరణకు తావులేకుండా ప్రచార కమిటీ ఖరారు చేశారు. ఇప్పుడు సినీ తారల వైపు దృష్టి సారించారు. అదే సమయంలో అభ్యర్థిత్వం ఖరారైన వారికి ప్రచార శైలి పట్ల అవగాహన పరుస్తున్నారు. దీంతో నవీన్‌ నివాస్‌ పరిసరాలు హడావిడిగా కనిపిస్తున్నాయి. అభ్యర్థిత్వం కోసం ఆశావాదులు, గెలుపే లక్ష్యంగా అధినేత సూచనల కోసం అభ్యర్థులు బారులు తీరుతున్నారు. నవీన్‌ పట్నాయక్‌ పిలుపు అందుకున్న ఓలీవుడ్‌ సినీ తారల ఆగమనంతో ముఖ్యమంత్రి నివాసం రద్దీగా తారసపడుతోంది.

సర్వత్రా ఉత్కంఠ..
ప్రధానంగా సినీ తారల రాకతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది. బీజేడీ అభ్యర్థుల జాబితా పరిపూర్ణం కాలేదు. ఈ ప్రక్రియ కోసం ఓలీవుడ్‌ తారలకు పిలుపు అందినట్లు పలు వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల పలువురు అగ్ర శ్రేణి చలన చిత్ర ప్రముఖులు బీజేడీని వీడారు. ఈ లోటుని భర్తీ చేయడంలో నవీన్‌ పట్నాయక్‌ తలమునకలైనట్లు సమాచారం. బాబూ షాన్‌, పప్పు పమ్‌పమ్‌, అమ్లన్‌ దాస్‌, శైలేంద్ర, అశ్విని త్రిపాఠి, ప్రజ్ఞ, భూమిక, సుప్రియ, ప్రేరణ, తారిఖ్‌ అజీజ్‌ వంటి ఒడియా చలన చిత్ర నటులు, నటీమణులు మరియు గాయకులు తాజాగా నవీన్‌ నివాసానికి వెళ్లారు.

పరిశ్రమ బాగోగులపై చర్చ..
నవీన్‌ నివాస్‌లో సుదీర్ఘ చర్చ తర్వాత బయటకు వచ్చిన ఓలీవుడ్‌ ప్రముఖులు మాట్లాడుతూ చలన చిత్ర రంగం పురోగతికి ముఖ్యమంత్రితో చర్చించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం, పోటీ, బిజూ జనతా దళ్‌ అభ్యర్థిత్వం వంటి అంశాలతో ఎటువంటి సంబంధం లేదని పప్పు పమ్‌పమ్‌ తెలిపారు. సినీ పరిశ్రమపైనే ప్రధానంగా చర్చ జరిగిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, బీజేడీ వ్యూహకర్త వి.కార్తికేయ పాండియన్‌ ఆహ్వానం మేరకు వచ్చినట్లు నటి సుప్రియ తెలిపారు. రానున్న పదేళ్ల వ్యవధిలో ఒడిశా చలన చిత్ర అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగిందన్నారు. ఇతే తరహాలో నవీన్‌ నివాస్‌లో సుదీర్ఘంగా బస చేసిన ఇతర ఓలీవుడ్‌ ప్రముఖులు స్పందించారు. మొత్తం మీద వీరితో ఎటువంటి రాజకీయపరమైన చర్చ సాగలేదని స్పష్టం చేశారు.

పార్టీలో చేరికలనే..
సార్వత్రిక ఎన్నికల నామినేషను దగ్గర పడుతున్నా టికెట్‌ ప్రకటన రాకపోవడంతో ఆశావాదుల్లో మాత్రం ఓలీవుడ్‌ తారలు హఠాత్తుగా ముఖ్యమంత్రి నివాసానికి రావడంతో వారు అధికార పార్టీలో చేరవచ్చనే ఊహాగానాల్ని రేకెత్తించింది. ప్రముఖ తారలు సిధాంత్‌ మహాపాత్రొ, అనుభవ్‌ మహంతి, అరిందమ్‌ రాయ్‌, ఆకాష్‌ దాస్‌ నాయక్‌ ఇటీవల బిజూ జనతా దళ్‌కు గుడ్‌ బై పలికి భారతీయ జనతా పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా గంజాం జిల్లా దిగొపొహండి నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థిగా సిధాంత్‌ మహాపాత్రొ బరిలో ఉన్నారు. ఒడియా భాష, సంస్కతి పట్ల బీజేడీ ప్రభుత్వ తీరు పట్ల సిధాంత మహాపాత్రో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి రానున్న ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా సంధించేందుకు సన్నద్ధత ప్రకటించారు.

ముఖ్యమంత్రి పిలుపు మేరకు హాజరైనప్రముఖ సినీ తారలు
1/1

ముఖ్యమంత్రి పిలుపు మేరకు హాజరైనప్రముఖ సినీ తారలు

Advertisement
Advertisement