మానసిక వికాసానికి నవ్వు అవసరం
రాయగడ: మానసిక వికాసానికి నవ్వు చాలా అవసరమని వక్తలు అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రేమ్ పహాడ్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో సాయిప్రియనగర్ వద్ద గల ట్రైబల్ బాలుర హొం వద్ద గురువారం యోగా, నవ్వు ప్రక్రియ గురించి క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బాబూరావు మహాంతి కార్యక్రమాలను నిర్వహించారు. మానసిక వికాసానికి నవ్వు ఎంతో అవసరమని, యోగాతో మానసిక ప్రశాంతత చేకూరుతోందని విద్యార్థులకు అవగాహన కల్పించారు. చదువుతో పాటు ఇటువంటి కార్యకలాపాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని మహాంతి సూచించారు. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు సక్రమంగా సాగుతోందన్నారు.
తమ్సా నది నీటిని విడుదల చేయాలి
● రైతు సంఘాల నాయకులు
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల, పోడియా సమితుల మధ్య ఉన్న తమ్సా నది కెనాల్ నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 16 పంచాయతీలకు చెందిన రైతులు గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కెనాల్ మరమ్మతుల కోసం 2021లో నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. మూడేళ్లలో పనులు పూర్తి చేస్తామని పోటేర్ ఇరిగేషన్ తరఫున రైతులకు సమాచారం ఇచ్చారు. కానీ మూడేళ్లు గడిచినప్పటికీ పనులు పూర్తి చేయలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పనులు పూర్తి చేస్తామని చెప్పిన అధికారులు హామీని నిలబెట్టుకోలేకపోయారు. దీంతో రైతులు అధికారులను కలుస్తూ సమస్యను వివరిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేయాలని జిల్లా రైతుసంఘం అధ్యక్షుడు ఎర్ర పోడియమి కోరారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు ముక మడ్కమి, పదియం కవాసి, సీక్‌పల్లి సర్‌పంచ్ విజయ్ కవాసి, చిత్రంగ్‌పల్లి సర్‌పంచ్ కౌశల్య కవాసి, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment