మిల్లు తిప్పి ఉపాధి కల్పించండి
నెల్లిమర: అక్రమ లాకౌట్‌లో ఉన్న జూట్‌మిల్లును తిప్పి కార్మికులకు ఉపాధి కల్పించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం విశాఖపట్నంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వద్ద నెల్లిమర్ల జూట్ మిల్లు సమస్యపై జాయింట్ సమావేశానికి సీఐటీయూ అనుబంధ సంఘం జూట్‌మిల్ వర్కర్స్ యూనియన్ తరఫున కిల్లంపల్లి రామారావు, అప్పలనర్సయ్య, ఐఎఫ్‌టీయూ తరఫున నామాల తిరుపతి రావు, కె.అప్పల సూరి, టి.అప్పారావు, శ్రామిక సంఘం తరఫున చిక్కాల గోవింద రావు, సముద్రపు సత్య నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ గత 9సంవత్సరాలుగా జూట్‌మిల్లు యాజమాన్యం గ్రాట్యుటీ బకాయిలు ఇవ్వలేదని, అలాగే పోస్ట్ డెటెడ్ చెక్‌లు ఇచ్చి రిటైర్డ్ కార్మికులు బ్యాంకు వద్దకు వెళ్తే ఖాతాలో నగదు లేక యాజమాన్యం ఇచ్చిన చెక్‌లు బౌనన్స్ అయిపోతున్నాయని తెలిపారు. అంతేకాకుండా గడిచిన 3సంవత్సరాలుగా యాజమాన్యం ఈఎస్‌ఐ, పీఎఫ్ నగదు కార్మికులనుంచి తీసుకుంటూ సంబంధిత అధికారులకు చెల్లించలేదని ఆరోపించారు. కార్మికులనుంచి యాజమాన్యం డెత్ ఫండ్ వసూలు చేసి రెండు, మూడు నెలల తరువాత ఆయా కుటుంబాలకు యాజమాన్యం వాటా లేకుండా ఇస్తోందన్నారు.
లాకౌట్ అన్యాయం
ముడిసరుకు కొరత విషయంలో కార్మికులు సహకరించలేదని జూట్‌మిల్లు యాజమాన్యం చెప్పడం భావ్యం కాదని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వెలిబుచ్చారు. 1989నుంచి కార్మికులు రూ. 5,రూ.10,రూ.18 కార్మికులనుంచి యాజమాన్యానికి రుణంగా ఇచ్చి సహకరించినట్లు తెలిపారు.
ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొని జూట్ యాజమాన్యానికి కార్మికులు సహకరిస్తుంటే యాజమాన్యం మాత్రం ముడి సరుకు కొరత పేరిట మిల్లును అక్రమ లాకౌట్ చేసి ఉపాధి లేకుండా చేయడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి మిల్లు తిప్పి ఉపాధి కల్పించడమే కార్మిక సంఘాల లక్ష్యమని పేర్కొన్నారు. లేకపోతే మిల్లు తిప్పి ఉపాధి కల్పిస్తారా? ఇతర మిల్లుల్లా గ్రాట్యుటీ బకాయిల చెల్లింపుతో పాటు కార్మికులకు యాజమాన్యం ఇవ్వాల్సిన రూ.5, రూ.10,రూ.18 తిరిగి చెల్లించి సెటిల్‌మెంట్ చేసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏసీఎల్ వచ్చే నెల 17కి చర్చలు వాయిదా వేస్తున్నామని అప్పటికీ యాజమాన్యం రాకపొతే కలెక్టర్, ఉన్నాతాధికారులకు నివేదిస్తామని ఏసీఎల్ చెప్పినట్లు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు.
ఉమా జూట్‌మిల్స్ కన్సొలేషన్ మీటింగ్ వాయిదా
కొత్తవలస: మండలంలోని కోటపాడు రోడ్డు సీతంపేట సమీపంలో గల ఉమా జూట్‌మిల్స్‌ను ఈ ఏడాది జూలై–15 వతేదీన యాజమాన్యం అక్రమంగా లాకౌట్ ప్రకటించి మూసేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి కార్మిక సంఘం ఎఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విజయగనరం డీసీఎల్, విశాఖపట్నం జేసీఎల్‌లు యాజమాన్యం, కార్మికులతో 9 పర్యాయాలు చర్చలు నిర్వహించినా యాజమాన్యం గైర్హాజరవుతూ వస్తోంది. దీంతో చివరిగా డిసెంబర్ 4వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించే కన్సొలేషన్ చర్చలకు యాజమాన్యం కచ్చితంగా హాజరుకావాలని జేసీఎల్ ఆదేశించినట్లు కార్మిక సంఘం అధ్యక్షుడు గణేష్ పండా మంగళవారం తెలిపారు. ఈ సమావేశానికి యాజమాన్యం హాజరు కాకపోతే కేసును ముగించి ప్రభుత్వానికి నివేదిస్తామని జేసీఎల్ స్పష్టం చేసినట్లు పండా తెలిపారు.
కార్మిక సంఘాల విజ్ఞప్తి
Comments
Please login to add a commentAdd a comment