బ్యాంక్ అధికారులు సహకరించాలి
విజయనగరం క్రైమ్: జిల్లాలో నమోదవుతున్న సైబర్ మోసాల నియంత్రణకు బ్యాంక్ అధికారులు ప్రత్యేక బాధ్యత వహించి, సైబర్ కేసులను దర్యాప్తు చేసే పోలీసు అధికారులకు సహాయ, సహకారాలు అందించాలని ఎస్పీ వకుల్ జిందాల్ కోరారు. ఈ మేరకు వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న మేనేజర్లు, ఇతర అధికారులతో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబర్ మోసాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, మోసగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతూ, ప్రజల నుంచి డబ్బులను దోచేస్తున్నారని, ఈ తరహా మోసాలను నియంత్రించేందుకు బ్యాంక్ అధికారులు కూడా సకాలంలో స్పందించి, వారివంతు సహాయ, సహకారాలను పోలీసు అధికారులకు అందించాలని కోరారు. పోలీసు అధికారులు కూడా దర్యాప్తులో భాగంగానే బ్యాంకుల నుంచి సమాచారాన్ని కోరుతారన్న విషయాన్ని అధికారులు గ్రహించాలని చెప్పారు. దర్యాప్తు అధికారులు కోరిన సమాచారాన్ని బ్యాంక్ అధికారులు సకాలంలో స్పందించి సమాచారాన్ని ఇవ్వకుంటే మోసానికి పాల్పడిన వ్యక్తి తప్పించుకునే ఆస్కారంతో పాటు తన బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిన నగదును ఇతర బ్యాంక్ అకౌంట్‌లకు ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉంటుందన్నారు.
క్షుణ్ణంగా తనిఖీ చేయాలి
కొత్తగా బ్యాంక్ అకౌంట్‌ను ప్రారంభించే సమయంలో ఖాతాదారు గుర్తింపు కార్డులను పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతనే బ్యాంక్ అకౌంట్ ప్రారంభమయ్యే విధంగా చూడాలని సూచించారు. అలాగే ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపే అనుమానాస్పద బ్యాంక్ అకౌంట్‌లపై నిఘా పెట్టాలని, ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులుండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. బ్యాంక్‌లు, ఏటీఎం కేంద్రాలను రాత్రి గస్తీ సమయాల్లో పోలీసు సిబ్బంది, అధికారులు సందర్శించే విధంగా పాయింట్ బుక్కులను ఏర్పాటు చేసుకునే విధంగా స్దానిక పోలీసు అధికారుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసుల్లో సమయం చాలా ముఖ్యమైనదని, ఇవ్వాల్సిన సమాచారాన్ని సకాలంలో బ్యాంక్ అధికారులు దర్యాప్తు అధికారులకు అందిస్తే, మోసాలకు పాల్పడిన నిందితులు పరారీ కాకుండా త్వరితగతిన పట్టుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, సీఐలు, వివిధ బ్యాంకుకు చెందిన మేనేజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ వకుల్ జిందాల్
Comments
Please login to add a commentAdd a comment