అవిభక్త కొరాపుట్ ప్రగతికి కట్టుబడి ఉన్నాం: సీఎం
జయపురం: అవిభక్త కొరాపుట్ జిల్లాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం మోహన్ చరణ్ మాఝి అన్నారు. ఆయన ఆదివారం జయపురం ఫూల్‌బెడలో 300 పడకల జిల్లా కేంద్రాస్పత్రి, సిబ్బంది క్వార్టర్లను ప్రారంభించారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. ఇది వీర భూమి అని సహీద్ లక్ష్మణ్ నాయిక్ లాంటి స్వాతంత్య్ర యోధులు ఇక్కడ పుట్టారని తెలిపారు. జిల్లాలో రూ.575 కోట్లతో 34 రకాల అభివృద్ధి పథకాలు చేపట్టనున్నామని తెలిపారు. సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం సౌకర్యాల కల్పన, రోడ్లు, వంతెనల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. జయపురంలో చారిత్రక జగన్నాథ సాగర్ అభివృద్ధికి తాము హామీ ఇస్తున్నామన్నారు. ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడి వారికే ఇస్తామన్నారు. నవరంగపూర్ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. జునాగుడ నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్‌కు రైలు మార్గం వేస్తామన్నారు. కార్యక్రమంలో జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, కొట్‌పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్ర, కొరాపుట్ ఎమ్మెల్యే రఘునాధ్ మచ్చ, నవరంగపూర్ ఎంపీ బలభధ్ర మఝి కొరాపుట్ కలెక్టర్ వి.కీర్తి వాసన్, ఎస్పీ రోహిత్ వర్మ, సీడీఎంఓ హాస్పిటల్ అధికారులు, పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జయపురం వచ్చిన సమయంలో రోడ్ షో నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment