జయపురం సమితిలో బీజేడీకి షాక్!
జయపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి జయపురం వచ్చి వెళ్లిన తరువాత జయపురం బీజేడీ పార్టీలో ప్రకంపనలు చోటుకుంటున్నాయి. జయపురం సమితి బీజేడీ చేతి నుంచి బీజేపీ ఆధీనంలోకి వెళ్లే పరిస్థితి నెలకుంది. బీజేడీ పార్టీ నాయకురాలు.. జయపురం సమితి అధ్యక్షురాలు తిలోత్తమ ముదులి తన మద్దతుదారులైన పలువురు సర్పంచ్‌లు, సమితి సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ సమితి సభ్యులతో బీజేపీ గూటికి చేరారు. బీజేపీ యువ నేత రవీంద్ర మహాపాత్రో నేతృత్వంలో తిలోత్తమ ముదులితో పాటు 20 మందికిపైగా ఆమె అనుచరులు సోమవారం భువనేశ్వర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మన్‌మోహణ సామల్ సమక్షంలో కాషాయి కండువాలు కప్పుకున్నారు. కొద్ది రోజుల కిందట జిల్లా పగ్గాలు మాజీ మంత్రి రబి నారాయణకు బీజేపీ పార్టీ అధినేత నవీణ్ పట్నాయక్ అప్పగించిన తరువాత చోటు చేసుకున్న ఈ సంఘటన రబి నందోను ఖంగు తినిపించింది. గత 24 ఏళ్ల నుంచి తన వెంట నడిచే.. బీజేడీలో ఉంటున్న సర్పంచ్‌లు, సమితి సభ్యులు అకస్మాత్తుగా పార్టీ మార్చటంతో ఆయన కుంగిపోవటమే కాకుండా బీజేడీ శ్రేణులను ఆశ్చర్యపరచింది. ఈ సంఘటన పార్టీకి తీరని నష్టం కాగా మాజీ మంత్రి రబినందో రాజకీయ భవితపై తీవ్ర ప్రభావం చూపుతోందని రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. బీజేపీ తీర్థం పుచ్చుకున్న వారిలో ఉమ్మరి పంచాయతీ సర్పంచ్ పబిత నాయిక్, రొండాపల్లి సర్పంచ్ ఆనంద హల్వ, కుములిపుట్ సర్పంచ్ సునీల పెంటియ, జయంతిగిరి సర్పంచ్ భొత్ర పూజారి, బరిణిపుట్ సర్పంచ్ పద్మ నందబలియ, ఆమె భర్త కమల నందబలిలతో పాటు ఎస్‌డీసీ సభ్యులు టంకుదొర హల్వ, సమితి అధ్యక్షురాలు భర్త నాగరావు, రబినందో నమ్మిన పలువురు స్థానిక నాయకులు ఉన్నారు. ఈ పరిణామం జయపురం బీజేడీ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
బీజేపీలో చేరిన సమితి అధ్యక్షురాలు, పలువురు సర్పంచ్‌లు
Comments
Please login to add a commentAdd a comment