అటవీ శాఖ సిబ్బందిపై దుండగుల కాల్పులు
● ఏనుగు దంతాల మాఫియా దురాగతం ● ఐదుగురు అరెస్టు ● రెండు ఏనుగు దంతాలు స్వాధీనం
రాయగడ: ఏనుగు దంతాలను అక్రమంగా తరలించడంతో పాటు వాటిని అమ్మేందుకు డీల్ జరుగుతుందన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు మెరుపు దాడులను నిర్వహించారు. ఏనుగు దంతాల మాఫియాను పట్టుకున్నారు. అయితే ఈ డీల్‌లో మరికొందరు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారిని కూడా పట్టుకునే ప్రయత్నంలో భాగంగా వారిని వెతుకుతున్న సమయంలో మాఫియా ముఠా సభ్యులు అటవీ శాఖ అధికారులపై తుపాకులతో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. సంచలం సృష్టించిన ఈ సంఘటన రాయగడ జిల్లాలోని మునిగుడ అటవీ రేంజ్ పరిధి జరఫా ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకోగా.. ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మునిగుడ అటవీ రేంజ్ పరిధి మలిముండ, జరఫా ప్రాంతాల్లో ఏనుగు దంతాల క్రయవిక్రయాలకు సంబంధించి మాఫియాలు డీల్ కుదుర్చుకుంటున్నారన్న సమాచారంతో మునిగుడ ,అంబొదల అటవీ అధికారులతో పాటు పొరుగు జిల్లా కలహండి అటవీ అధికారులు శనివారం జరఫా ప్రాంతంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురిని పట్టుకున్న అధికారులు వారివద్ద నుంచి రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ముగ్గురు రాయగడకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు కలహండి జిల్లాకు చెందిన వారుగా సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి నిందితులతో పాటు మరి కొందరు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారిని పట్టుకునే ప్రయత్నంలో అటవీ ప్రాంతం గుండా వెళ్లారు. ఇది తెలుసుకున్న దుండగులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. చీకట్లో జరిపిన కాల్పులతో అటవీ శాఖ సిబ్బంది ఆందోళనకు చెంది తాము తెచ్చుకున్న బోలేరో వాహనంలోకి దూరిపొయారు. అయితే అంతటితో ఆగని దుండగులు వారిని హతమార్చే ప్రయత్నంలో బొలేరో వెనుక గల గ్లాస్‌ను మారణాయుధాలతో పగలగ్గొట్టారు. అనంతరం అక్కడి నుంచి ఫరారయ్యారు. దుండగుల కాల్పుల కారణంగా బొలేరో డోర్‌కు తుటా తగిలి రంధ్రం ఏర్పడింది. అటవీ సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అరెస్టయిన ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసు అధికారులు నిందితులను దర్యాప్తు చేసిన అనంతరం సొమవారం కోర్టుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment