విస్తారంగా వర్షాలు
భువనేశ్వర్: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల గురువారం రాత్రి నుంచి వర్షం ప్రారంభం కాగా, ఇతర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఇదే వాతావరణ పరిస్థితి మరో 2 రోజులపాటు నిరవధికంగా కొనసాగే అవకాశం ఉందని స్థానిక ప్రాంతీయ వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 19 జిల్లాలకు ఐఎండీ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. వివిధ ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఈ కేంద్రం సమాచారం.
● పంటలపై ప్రభావితం
రాష్ట్రంలో అకాల వర్షాలు మరోసారి పంటలపై విపరీత ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పొలాల్లో పంటని ముందస్తు జాగ్రత్త చర్యలతో సంరక్షించుకోవాలని వాతావరణ కేంద్రం సూచించింది. కటక్, భువనేశ్వర్ జంట నగరాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో సాధారణ జన జీవనం ప్రభావితం అయింది.
● పెరిగిన చలి
బంగాళాఖాతంలో వాతావరణ మార్పు ప్రభావంతో శుక్రవారం నుంచి చలి తీవ్రత పెరిగింది. తాజా వాతావరణ పరిస్థితుల ప్రభావంతో మరో 4 రోజులపాటు చలి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం సమాచారం.
● ప్రభావిత జిల్లాలు
కొరాపుట్, మల్కన్‌గిరి, రాయగడ, నవరంగపూర్, కలహండి, కంధమల్, నువాపడా, బొలంగీరు, సోన్‌పూర్, అంగుల్, ఢెంకనాల్, కెంజొహర్, మయూర్‌భంజ్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో ప్రభావితం అవుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
● 4 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
గంజాం, గజపతి, కేంద్రాపడా, జగత్‌సింగ్‌పూర్ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్ష సూచన జారీ అయింది.
● రాజధానిలో తగ్గిన ఉష్ణోగ్రత
రాజధాని నగరం భువనేశ్వర్‌లో శుక్రవారం పగటి పూట వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాతావరణం 26.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి వాతావరణంలో 8.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దిగజారి 18.2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం అయింది.
Comments
Please login to add a commentAdd a comment