ఉచిత న్యాయ సహాయం పొందండి
విజయనగరం క్రైమ్: రిమాండ్‌లో ఉన్న ముద్దాయిలకు ఎవరూ న్యాయవాది లేకుండా ఉండకూడదని, అలాంటి వారికి జిల్లా న్యాయసేవాధికార సంస్ధ న్యాయవాదిని ఉచితంగా అందిస్తుందని అదనపు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి టివి.రాజేష్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ చక్రవర్తి ఆదేశాలతో శనివారం విజయనగరం సబ్‌జైల్‌ను సందర్శించారు. కారాగారంలో ఉన్న ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించి, వారికి పలు చట్టాలపై అవగాహన కల్పించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులు, అస్వస్ధతతో ఉన్నటువంటి ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సబ్ జైల్లో కొనసాగుతున్న జైల్ లీగల్, ఎయిడ్ క్లినిక్‌లను తనిఖీ చేశారు. జైల్లో ఉన్న ముద్దాయిలకు సకాలంలో న్యాయసహాయమందించేందుకు జైల్ లీగల్ ఎయిడ్ క్లినిక్ ఏర్పాటు చేశామని, వాటిని సక్రమంగా కొనసాగించాలని సూచించారు. జైల్లో ఉన్న ముద్దాయిలకు ఉచిత న్యాయ సహాయమందించడమే జిల్లా న్యాయసేవాధికార సంస్థ ముఖ్య కర్తవ్యమన్నారు. జైల్లో అమలవుతున్న సౌకర్యాలు గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. వంటగదిని, భోజనశాలను, స్టోర్ రూమ్ తదితర వాటిని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ బి.సంపత్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి టివి.రాజేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment