ప్రకృతి అందాలకు నిలయం గజపతి
● వైభవంగా నాల్గో రోజు గజపతి
ఉత్సవాలు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో ప్రకృతి సౌందర్య జలపాతాలు, పర్యాటక కేంద్రాలైన మహేంద్రగిరి, గుద్‌గుదా, గండాహతి వంటివి ఉన్నాయని, వీటిని ప్రస్తుతం రాష్ట్ర పర్యాటక శాఖ అభివృద్ధి చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం ఆనందదాయకమని బలంఘీర్ జడ్జి పవిత్ర మోహాన్ సామల్ అన్నారు. శనివారం గజపతి స్టేడియంలో నాల్గో రోజు ఉత్సవాలను జిల్లా జడ్జి ప్రణబ్‌కుమార్ రౌత్రాయ్, పవిత్ర మోహాన్ శామల్ ప్రారంభించారు. వేదికపై పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి బాలముకుంద భుయ్యాన్, ఐఐటీ రూర్కీ డా.పాణిగ్రాహి, కేంద్రపడా కలెక్టర్ స్మృతి రంజన్ ప్రధాన్, రాయగడ జిల్లా ఎస్పీ స్వాతి ఎస్.కుమార్, సి.ఎస్.ఐ.ఆర్. వైజ్ఞానికులు సరోజ్ కుమార్ పాణిగ్రాహి, డి.ఎఫ్.ఓ ఎస్.ఆనంద్, ఎస్పీ జితేంద్ర కుమార్ పండా వున్నారు. జిల్లా కలెక్టర్, సంస్కృతి శాఖ చైర్మన్ బిజయ కుమార్ దాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయోధ్యలో బాలరాముని సూర్యతిలకం ప్రాజెక్టులో ముఖ్యపాత్ర వహించిన సరోజ్ కుమార్ పాణిగ్రాహిని కలెక్టర్ సత్కరించారు. గౌరవ అతిథులు కేంద్రపడా కలెక్టర్ స్మృతి రంజన్ ప్రదాన్, రాయగడ ఎస్పీ స్వాతి ఎస్.కుమార్‌ను కలెక్టర్ సత్కరించారు. పలువురికి ప్రకృతి మిత్ర అవార్డులను కలెక్టర్ అందజేశారు. గజపతి స్టేడియంపై సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. వర్షం వెలిసిన తరువాత గజపతి ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు విచ్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment