గంజాయి సాగు ధ్వంసం
రాయగడ: జిల్లాలోని పద్మపూర్ సమితి నువాగడ పంచాయతీ మహాదిమ్ ప్రాంతంలో గంజాయి వనాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్న 24 వేల గంజాయి మొక్కలను ధ్వంసం చేసి వాటిని తగుల బెట్టారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు.
హత్య కేసులో నిందితుడు అరెస్టు
రాయగడ: అప్పు తీర్చలేదన్న కోపంతో స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ స్వాతి ఎస్‌జకుమార్ మంగళవారం రాత్రి తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. టికిరి పంచాయతీ దొరాగుడ గ్రామానికి చెందిన(ఆర్‌ఆర్‌నగర్‌లో నివాసముంటున్నాడు) బలరాం, జిరిగాం గ్రామానికి చెందిన రమేష్ జొడియాలు స్నేహితులు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని రమేష్ వద్ద బలరాం రూ.25 వేల అప్పు తీసుకున్నాడు. తిరిగి తీర్చాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడంతో బలరాంను ఈ నెల 14న కాశీపూర్ సమితి జిరిగాంలో రమేష్ హత్య చేశాడు. బలరాం వద్ద పర్సును తీసుకున్న రమేష్ అందులో డెబిట్ కార్డును షాపింగ్, బ్యాంకు లావాదేవీలకు ప్రయత్నించాడు. బ్యాంకు సీసీ కెమెరాల ఆధారంగా రమేష్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. విలేకర్ల సమావేశంలో ఏఎస్పీ బిష్ణుప్రసాద్ పాత్రో, ఎస్‌డీపీఓ రస్మీరంజన్ సేనాపతి పాల్గొన్నారు.
కుక్కల దాడిలో చిన్నారి మృతి
జయపురం : జయపురం సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితి పుప్పుగాం గ్రామంలో వీధికుక్కల దాడిలో చాందినీ హరిజన్(6) అనే బాలిక మృతి చెందింది. బుధవారం ఉదయం బాలిక తన ఇంటి సమీపంలోని పొలం వద్ద పశువులు మేస్తుండగా అక్కడికి వెళ్లింది. ఒక్కసారిగా ఐదు కుక్కలు చుట్టుముట్టి దాడి చేశాయి. బాలిక కేకలు విని సోదరుడు పరుగుపరుగున వెళ్లి విషయం గ్రామస్తులకు చెప్పాడు. అప్పటికే తీవ్రంగా గాయపడిన బాలికను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కుములిపుట్ ప్రాథమిక చికిత్సాలయానికి తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. చాందిని పుప్పుగాంలో తన తాత ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటోంది. కుమార్తె ఇక లేదని తెలిసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
ఐదెకరాల్లో గంజాయి సాగు ధ్వంసం
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి చింతలవాడ పంచాయతీ కర్కటపల్లి, పరజాగూడ గ్రామాల్లోని ఐదు ఏకరాల్లో సాగు చేస్తున్న గంజాయి మొక్కలను కోరుకొండ సమితి పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. ఈ సాగును కొండలపై చేస్తున్నారు. కోరుకొండ పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో కలిమెల తహసీల్దార్ రామకృష్ణ సత్యరాజ్ ఆధ్వర్యంలో గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. గంజాయి పంట విలువ రూ.60 లక్షల ఉంటుందని పోలీసులు తెలిపారు.
రత్న భాండాగారం పనులు నిలిపివేత
భువనేశ్వర్: పూరీ జగన్నాథుని రత్న భాండాగారం నిర్వహణ, మరమ్మతు పనులు తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారవర్గాలు బుధవారం ప్రకటించాయి. ఈ నెల 17 నుంచి పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. క్రిస్మస్ సెలవులు, ఆంగ్ల సంవత్సరాది పురస్కరించుకుని శ్రీ మందిరానికి భక్తుల తాకిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రత్న భాండాగారం మరమ్మతు పనుల కారణంగా దర్శనానికి అంతరాయం కలగకుండా తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అధికార వర్గాలు వివరించాయి. కొత్త సంవత్సరంలో జనవరి 2 వరకు శ్రీమందిరం రత్న భాండాగారం మరమ్మతులు నిలిపివేసినట్లు ప్రకటించారు. జనవరి 3 నుంచి పనులు యథాతథంగా కొనసాగిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment