ఎందుకో.. ఏమో..!
● అనూహ్యంగా గవర్నరు రఘుబర దాస్ రాజీనామా ● రాజకీయవర్గాల్లో వాడీవేడి చర్చ
భువనేశ్వర్: రాష్ట్ర గవర్నర్‌గా రఘుబర దాస్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయవర్గాల్లో వాడీవేడి చర్చకు దారితీసింది. రఘుబర దాస్ రాజీనామా, కొత్త గవర్నరు నియామకం పట్ల ఏమాత్రం విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. రఘుబరదాస్ రాజీనామాకు ప్రేరేపించిన పరిస్థితుల పట్ల జోరుగా చర్చ సాగుతోంది. గత ఏడాది అక్టోబర్ 18న రాష్ట్ర గవర్నర్‌గా రఘుబర్‌దాస్ నియమితులయ్యారు. ఈ ఏడాది జరిగిన పూరీ జగన్నాథుని రథ యాత్ర సమయంలో ఆయన కుమారుడి నిర్వాకంతో వివాదంలో చిక్కుకున్నారు. గవర్నరు వ్యక్తిగత రక్షకుడిపై అమానుష దాడి తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై ప్రభుత్వం ఇంత వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. నెల రోజుల్లో విచారణ నివేదిక అందడంతో పదవులు, హాదాలు, పార్టీలకు అతీతంగా బాధ్యుతులైన వారి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. పూరీ జిల్లా కలెక్టరుని విచారణ అధికారిగా నియమించింది. ఈ విచారణ ఎక్కడి గొంగలి అక్కడే అన్న మాదిరి మరుగున పడింది. ఇంత వరకు విచారణ వివరాలు వెల్లడి కాలేదు. ఇంతలో గవర్నరు పదవికి రాజీనామా చేయడం, కొత్త గవర్నరు నియామకం జరగడం రాజకీయ శిబిరాల్లో కలకలం రేపింది.
మనస్పర్థలే కారణమా?
జార్ఖండ్‌లో భారతీయ జనతా పార్టీ ఓటమికి రఘుబర్‌దాస్ వర్గ స్పర్థలు కారణమనే ఆరోపణలు రాజకీయ శిబిరాల్లో దుమారం రేపుతున్నాయి. స్థానిక రాజ్ భవన్ కేంద్రంగా సొంత రాష్ట్రం రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామాను భారత రాష్ట్రపతి ఆమోదించడం, కొత్త గవర్నర్ నియామకం కూడా పూర్తి కావడం వెనక భారీ వ్యూహం ఉందని రాష్ట్రంలో రాజకీయ పక్షాల్లో చర్చ ఊపందుకుంటోంది.
అధిష్టానం నిర్ణయం మేరకే ...
గవర్నరు రఘుబర దాస్ రాజీనామా భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు జరిగి ఉంటుందని రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ అభిప్రాయపడ్డారు. కేంద్ర కమిటి ఈ విషయమై కూలంకషంగా చర్చించిన మేరకు రాజీనామా ఖరారై ఉంటుందన్నారు.
సొంత నిర్ణయం..
రఘుబర దాస్ గవర్నరు పదవికి రాజీనామా చేయడం ఆయన సొంత నిర్ణయని, ఈ విషయమై ఎటువంటి చర్చ జరగలేదని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి విజయపాల్ సింగ్ తోమర్ తెలిపారు. పార్టీ కేంద్ర కమిటి నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
విధేయతతో కొనసాగుతా..
భారతీయ జనతా పార్టీ పట్ల విధేయతతో కొనసాగుతానని రాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేసిన రఘుబర్ దాస్ తెలిపారు. ఒడిశా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టంగా పేర్కొన్నారు. తన పట్ల ఒడిశా ప్రజల ప్రోత్సాహం అభినందనీయమని కొనియాడారు. 2036 నాటికి ఒడిశా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజీనామా తదనంతర కార్యాచరణ నేపథ్యంలో మాట్లాడుతూ తన భవిష్యత్ పాత్ర ఏమిటో పార్టీ నిర్ణయిస్తుందన్నారు. 1980 నుంచి పార్టీ సభ్యునిగా పనిచేస్తున్నానని, పార్టీఽ అధిష్టానం కేటాయించిన బాధ్యతల్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment