ధాన్యం కొనుగోలు మండీలపై నిఘా!
జయపురం: ఖరీఫ్ సీజన్‌లో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన మండీల్లో జరిగే కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక నిఘా వేశారు. జయపురం సబ్‌కలెక్టర్ ఎ.శొశ్యారెడ్డి తన కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అచ్చట ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. మండీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని మోనిటర్‌తో సబ్‌కలెక్టర్ కార్యాలయ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. మండీలలో ఎటువంటి సమస్య ఎదురైన రైతులు అక్కడ నుంచే కంట్రోలు రూంకు తెలియజేయవచ్చు. కంట్రోల్ రూంలో విధుల్లో ఉండే ఉద్యోగి మండీలలో జరుతున్న పరిస్థితులను నేరుగా తెలుసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మండీలలో జరుగుతున్న కార్యకలాపాలు, రైతుల సమస్యలను తెలుసుకొనేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కంట్రోల్ రూములో హెల్ఫ్‌లైన్ ఏర్పాటు చేసి..ప్రత్యేకంగా 06854–230300 నంబర్‌ను కేటాయించారు. మండీలలో సమస్యలను రైతులు ఈ నంబర్‌కు నేరుగా తెలియజేయవచ్చు. రైతుల అభియోగాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిజస్టర్‌లో హెల్ఫ్‌లైన్ ఉద్యోగి నమోదు చేస్తారు. వాటిని అధికారులు పరిశీలించి తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. జయపురం సబ్‌డివిజన్‌లో 73 స్థానాలలో ధాన్యం కొనుకోలు మండీలు ఏర్పాటు చేసి వాటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం మోనిటర్‌తో అనుసంధానం చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించారు. మండీలు ప్రారంభించిన రోజునే వాటిని కంట్రోల్ రూంతో కనెక్టు చేస్తారు. అలాగే ధాన్యం ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా బొయిపరిగుడ సమితి టంగినిగుడ, కొట్‌పాడ్ సమితిలో చందిలి రహదారులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిని కూడా కంట్రోల్ రూంకు అనుసంధానం చేస్తామన్నారు.
కంట్రోల్ రూం ఏర్పాటు
నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment