భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో బడ్జెట్ సమావేశాలు పురస్కరించుకుని స్పీకరు సురమా పాఢి హెచ్చరిక జారీ చేశారు. 17వ శాసన సభ మూడో విడత సమావేశాలు ఫిబ్రవరి నెల 13వ తేదీ నుంచి ఆరంభం కానున్నాయి. ఈ సందర్భంగా సభలో ప్రతిపక్షాలు ఎలాంటి అంతరాయం కలిగించరాదని, నిర్మాణాత్మక ప్రతిపాదనలు, చర్చలకు నిరభ్యంతరంగా అవకాశం లభిస్తుందని, సభా కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలిగించినా సహించేది లేదని స్పీకరు హెచ్చరించారు. ఈ విడత సమావేశాల్లో ప్రభుత్వ 2024–25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెడుతుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నిర్మాణాత్మక ప్రతిపాదనల్ని సభలో అనుమతిస్తారు. సభలో ప్రతిపక్షాలు రచ్చకు దిగితే సహించేది లేదన్నారు. సభా కార్యక్రమాలు ఆరంభానికి ముందు అఖిల పక్ష సమావేశం జరగనుంది. ఈ మేరకు తేదీ త్వరలో ప్రకటించడం జరుగుతుందన్నారు.
సమావేశాల షెడ్యూలు
శాసన సభ బడ్జెటు సమావేశాలు ఫిబ్రవరి నెల 13 నుంచి ఆరంభం అవుతాయి. తొలి రోజున గవర్నర్ ప్రసంగం కార్యక్రమం ఖరారు చేశారు. తదుపరి 2 రోజులు 14, 15 తేదీల్లో గవర్నరు ప్రసంగంపై చర్చ సాగుతుంది. ఈసారి సమావేశాల నిడివి 28 పని దినాలు ఉంటాయి. 3 రోజులు అధికారిక మరో 3 రోజులు ప్రభుత్వేతర వ్యవహరాలు కొనసాగుతాయి.
17న బడ్జెటు ప్రవేశం
ఫిబ్రవరి నెల 17న సభలో 2024–25 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. ఆర్థిక శాఖ బాధ్యతలు వహిస్తున్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి బడ్జెటుని ప్రవేశ పెడతారు. 20, 21వ తేదీల్లో బడ్జెట్‌పై సభలో చర్చిస్తారు. 22 నుంచి మార్చి నెల 6వ తేదీ వరకు వివిధ సలహా కమిటీలు నివేదికలు ప్రవేశ పెడతారు. 29న వ్యయ మంజూరు బిల్లు ప్రవేశ పెడతారు.
Comments
Please login to add a commentAdd a comment