![ఆయుష్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/07022025-odisha-01_subgroupimage_287208912_mr-1738869642-0.jpg.webp?itok=O6qoAAQk)
ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరం
మల్కన్‌గిరి: జిల్లాలోని శిఖపల్లి పంచాయతీ ఎంవీ 19 గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరం గురువారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆయుష్మాన్ వైద్యాధికారి డా.మహేశ్ కుమార్ బరిక్, శిఖపల్లి ఆరోగ్య కేంద్రం వైద్యులు స్వర్ణప్రభ రౌయి, సంతోషిరాయ్‌లు రోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5 గ్రామాలకు చెందిన సుమారు 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. ప్రతినెలా రెండో సోమవారం ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.
నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు
రాయగడ: నదీతీర ప్రాంతాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. జిల్లాలోని కాసీపూర్ సమితి అడాజోర్ పంచాయతీ పరిధి కిషకంక్‌బెడి గ్రామ సమీపంలోని నదీతీరంలో నాటుసారా తయారీ జరుగుతుందన్న సమాచారం మేరకు దాడులను చేపట్టారు. దాడుల్లో 2,500 లీటర్ల నాటుసారీ తయారీ కోసం వినియోగించే ఊట, మరో 60 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసులు దాడుల సమాచారం తెలుసుకున్న తయారీదారులు అక్కడి నుంచి పరారయ్యాడు.
70 కిలోల గంజాయి స్వాధీనం
బరంపురం: అక్రమంగా 70 కిలోల గంజాయిని తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశామని అబ్కారీ నిఘా విభాగం ఉప సూపరింటెండెంట్ శృతికాంత్ రౌత తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గంజాం జిల్లా అస్కా ప్రాంతంలో బుధవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా, మినీ వ్యానులో 70 కిలోలు గంజాయి ఉన్నట్లు గుర్తించి పైలట్, వెనుక వ్యానుకు ఎస్కార్ట్‌గా వస్తున్న కారును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి పరాయి కావడంతో నలుగురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. నిందితులు కందమాల్ జిల్లా దారింగిబాడి నుంచి గంజాయిని తీసుకువచ్చి గంజాం జిల్లా పురుషోత్తపూర్‌కు తరలించి, అక్కడి నుంచి ప్యాకింగ్ చేసి ముంబాయి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ముగిసిన టెన్నిస్ పోటీలు
బరంపురం: టెన్నిన్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలవాలని ఎస్పీ డాక్టర్ శ్రవణ్ వివేక్ అన్నారు. యూనియన్ క్లబ్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా బరంపురం క్లే మైదానంలో జరుగుతున్న ఐత జీడీటీఏ ఓటీఏ సూపర్ సీరీస్ అండర్–16 బాల,బాలికల టెన్నిస్ పోటీలు గురువారంతో ముగిశాయి. ఈ పోటీల్లో బాలుర సింగిల్స్ ఫైనల్లో ఒడిశాకు చెందిన టాప్ సీడ్ అహాన్ మిశ్రా 6–4, 7–5తో తమిళనాడుకు చెందిన ఫజల్ ఆలీమీర్‌పై విజయం సాధించాడు. బాలికల విభాగంలో టాప్ సీడ్ అహాన్ 6–1, 6–4తో బెంగాల్‌కు చెందిన రియా రాయ్‌పై గెలిపొంది విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టోర్నమెంట్ డైరెక్టర్ బి.స్వరంజన్ పట్నాయక్, టోర్నమెంట్ కార్యదర్శి ఉమాశంకర్ పాధి, రిఫరీ జతిన్ బత్స్య, జీడీటీఏ అధ్యక్షుడు అబ్ధుల్ సత్తార్‌లు పాల్గొన్నారు.
![ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/07022025-odisha-01_subgroupimage_287203216_mr-1738869642-1.jpg)
ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరం
![ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరం 2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06ors21-280082_mr-1738869642-2.jpg)
ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరం
![ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరం 3](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06ors72a-280027_mr-1738869642-3.jpg)
ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరం
Comments
Please login to add a commentAdd a comment