కదం తొక్కిన మిషన్ శక్తి మహిళలు
రాయగడ: న్యాయమైన తమ పది డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని మిషన్ శక్తి, జీవికా మిషన్‌కు చెందిన వందలాది మంది మహిళలు గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి పేరిట ఒక వినతిపత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్ర నాయక్‌కు సమర్పించారు. నిఖిల్ ఒడిశా మిషన్ శక్తి మహిళా సంఘం రాయగడ శాఖ అధ్యక్షురాలు మమత పాణిగ్రహి, కార్యదర్శి కుమారి పాలక నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళన సుమారు రెండు గంటల పాటుగా జరిగింది. స్థానిక పీడబ్ల్యూడీ బంగ్లా నుంచి ర్యాలీగా వచ్చిన మహిళలు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన మిషన్ శక్తి, జీవికా మిషన్ వంటి పథకాల వల్ల ఎంతో మంది మహిళలు ఆర్థిక, సామాజిక రంగాల్లో ఉన్నతి చెందారని మమతా పాణిగ్రహి అన్నారు. అయితే రాష్ట్రంలో కొలువు దీరిన కొత్త ప్రభుత్వం మిషన్ శక్తి, జీవికా మిషన్ పథకాల్లో కొత్త రీస్టక్చరింగ్ పేరుతో కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. దీని వల్ల ఎందరో మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎప్పటిలాగే మిషన్ శక్తి, జీవికా మిషన్ పథకాలను కొనసాగించాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిషన్ శక్తి, జీవికా మిషన్ పథకాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్న డిమాండ్‌తో చేపట్టిన ఆందోళనకు ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి జయంతి దాస్ తదితరులు పాల్గొని తమ మద్దతును తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment