బీడీ ఆకుల గిడ్డంగిలో గంజాయి
జయపురం: ఒడిశా ఫారెస్టు డివిజన్ కార్పొరేషన్ ఖెంధూలీప్(బీడీ ఆకుల గిడ్డింగి) గిడ్డంగిలో పెద్ద ఉత్తున గంజాయి పట్టుబడినట్లు జయపురం సదర్ పోలీసు అధికారి ఈశ్వర చంద్ర తండి శుక్రవారం ప్రకటనలో వెల్లడించారు. గురువారం సాయంత్రం పోలీసు అధికారి ఈశ్వర తండి డైరెక్షన్ ప్రకారం సబ్ ఇన్‌స్పెక్టర్ ఆర్‌కే బారిక్ పోలీసు సిబ్బందితో జయపురం సమితి ఎకంబా గ్రామ ప్రాంతంలో పెట్రోలింగ్ జరుపుతుండగా ఎకంబా గ్రామ సమీపంలో గల ఒడిశా ఫారెస్టు డివిజన్ కార్పొరేషన్ వారి ఖెందూ లీఫ్ గిడ్డంగిలో గంజాయి నిల్వ ఉన్నట్లు వారికి సమాచారం వచ్చింది. వెంటనే ఎస్‌ఐ బారిక్ తన సిబ్బందితో ఖెందూ లీఫ్ గిడ్డంగికి వెళ్లారు. అయితే వారు వెళ్లేసరికి గిడ్డంగి షట్టర్ మూసి ఉంది. అంతే కాకుండా షట్టర్‌కి తాళాలు కూడా వేయలేదు. వెంటనే వారు గిడ్డంగిని చుట్టు ముట్టారు. షట్టర్ తెరిచి లోపలకు వెళ్లి చూడగా.. పెద్ద ఎత్తున గంజాయి బస్తాలు కనిపించాయి. వెంటనే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌ను రప్పించి అతని సమక్షంలో గిడ్డంగిలో సీజ్ చేసిన గంజాయిని తూయించగా అవి 248 కేజీల 100 గ్రాములు ఉందని, గంజాయి నెట్ వెయిట్ 247 కేజీల 100 గ్రాములుందని పోలీసు అధికారి ఈశ్వర తండి వెల్లడించారు. గంజాయిని సీజ్‌చేసి ఎన్‌డీపీఎస్ చట్టం నిబంధనల ప్రకారం అన్ని ఫార్మాలిటీస్ నిర్వహించి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment