నాడు పవిత్రం...
కారెంపూడి: ఆనాడు పల్నాటి వీరుల రక్తంతో ప్రవహించిన నాగులేరు..నేడు వ్యర్థాలతో నిండిపోయి మురికికూపంగా మారింది. ఈ నెలాఖరు కార్తీక అమావాస్య నుంచి పల్నాటి వీరారాధన ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మరో వైపు నాగులేరు మాత్రం గర్భశోకంతో తల్లడిల్లిపోతోంది. ఉత్సవాలకు వచ్చే వీరాచారులు నాగులేరు గంగధారిలోనే పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారి దైవాలు (ఆయుధాలు)లను ఇక్కడే శుభ్రం చేసుకుని వాటికి ప్రాణ ప్రతిష్ట చేసుకుని పూజ కట్టుకుంటారు. అంతటి ప్రాధాన్యం నాగులేరుకు ఉంది. నాగులేరు ఒడ్డునే పల్నాటి రణం జరిగిన విషయం తెల్సిందే. పల్నాటి చరిత్రలో నాగులేరు జీవనదికి విశిష్ట స్థానం ఉంది. అందుకేనేమో శ్రీనాధుడు నాగులేరు గంగధారిని కాశిలోని మణికర్ణిక నది అంతటి పవిత్రమైనదిగా వర్ణించారు. అంతటి ప్రాధాన్యం ఉన్న నాగులేరు దాని పరివాహ ప్రాంత దుస్థితి ఇది.
కొనసాగుతున్న ఆక్రమణల పర్వం
మరో వైపు వాగు పరివాహ ప్రాంతం ఆక్రమణలకు గురౌతోంది. చెన్నకేశవస్వామి ఆలయం నుంచి నాగులేరు గంగధారి మడుగుకు వచ్చే విశాలమైన వీర్ల డొంక నామమాత్రపు దారిగా మారిపోయింది. వీర్లగుడి నుంచి కళ్లిపోతురాజు మండపానికి వెళ్లే విశాలమైన వీర్ల డొంక కాస్త చిన రోడ్డుగా మారిపోయింది. ఈ రెండు దారులు ఉత్సవాలలో చాలా ముఖ్యమైనవి. పల్నాటి వీరాచారులు వీరుల ఆయుధాలతో నాగులేరులో పూజకట్టుకున్న అనంతరం పలు కార్యక్రమాలు క్రతువులు నిర్వహించే ప్రధాన దారులివి. నాగులేరు పరివాహ ప్రాంతం 1100 ఎకరాల దాకా ఉందని గతంలో జరిగిన సర్వేలో తేలింది. అయితే వాగు పారే దారి ఒకటి ఉంచి మిగతా ప్రాంతాలలో పాగా వేశారు. ఇంకా మిగిలిన దాన్లో పాగా వేసేందుకు సకలం సిద్ధం చేసుకుంటున్నారు. మరో వైపు నాగులేరును విచ్చలవిడిగా గ్రావెల్ కోసం తవ్వేస్తున్నారు. దీంతో నాగులేరు గర్భశోకంతో తల్లడిల్లిపోతోంది. 1980 ప్రాంతంలోనే అప్పటి గ్రామ సర్పంచ్ నాగులేరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఏకంగా వాచ్‌మెన్‌ను నియమించి వాగు నీటిని పరిశుభ్రంగా అందరూ వినియోగించుకునేందుకు వీలుగా చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత పట్టించుకున్న వారే లేరు. దీంతో నాగులేరులో వ్యర్థాలు కలసి నీరు కలుషితమై తాగేందుకు పనికిరాకుండా పోయింది. ఇప్పటికైనా వ్యర్థాలను తొలగించి కలుషితం కాకుండా చూడాలని కోరుతున్నారు.
డంపింగ్ యార్డుగా మార్చేశారు..
నాగులేరును డంపింగ్ యార్డుగా మార్చేశారు. బస్టాండ్‌లో పోగైన వ్యర్థాలను అత్యంత బాధ్యతారాహిత్యంగా నాగులేరులో వేస్తున్నారు. అవి పేరుకుపోయి కుళ్లి వాగు నుంచి దుర్గంధం వస్తోంది. నాగులేరు బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగించేవారికి ఇది తీవ్ర అసౌకర్యంగా మారింది. గ్రామస్తులతోపాటు ఉత్సవాలకు వచ్చే వారు టాయిలెట్స్ లేకపోవడం వల్ల వాగు పరివాహ ప్రాంతాన్నే అందుకు వాడుతున్నారు. ఇది చూడలేక ఒక దాత టాయిలెట్స్ నిర్మాణానికి పూనుకుని నిర్మాణం చేయించారు. దాన్ని కొందరు అడ్డుకోవడంతో మిగిలిన పనులు కాస్తా నిలిచిపోయి అది నిరుపయోగంగా మారింది.
పల్నాటి చరిత్రలో జీవనదిగా విశిష్ట స్థానం వ్యర్థాలతో నిండి దుర్గంధం ఆ మార్గంలో ప్రయాణించేందుకు అవస్థలు విచ్చలవిడిగా ఆక్రమణలు యథేచ్చగా తవ్వకాలు కుచించుకుపోతున్న నాగులేరు పట్టించుకోని పాలకులు, అధికారులు
పల్నాటి చరిత్రలో జీవనదిగా విశిష్ట స్థానం వ్యర్థాలతో నిండి దుర్గంధం ఆ మార్గంలో ప్రయాణించేందుకు అవస్థలు విచ్చలవిడిగా ఆక్రమణలు యథేచ్చగా తవ్వకాలు కుచించుకుపోతున్న నాగులేరు పట్టించుకోని పాలకులు, అధికారులు
Comments
Please login to add a commentAdd a comment