అమరేశ్వరాలయంలో కార్తిక సందడి
అమరావతి: అమరావతి క్షేత్రంలోని బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో శనివారం కార్తికమాసం ప్రారంభం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునుంచే అమరేశ్వరాలయంలో భక్తుల సందడి నెలకొంది. భక్తులు పవిత్ర కృష్ణానదిలో కార్తిక స్నానాలు చేసి ఆలయంలో కార్తిక దీపాలు వెలిగించి కార్తిక దామోదరునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు ఇబ్బందిపడకుండా క్యూలైన్‌లు ఏర్పాటుచేశారు. తాగునీరు, ఉచిత అన్నదానం, ప్రసాదం అందజేశారు. గతేడాది లాగానే గ్రామంలో, ఆలయంలో, స్నానఘాట్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ బందోబస్తు నిర్వహిస్తుంది. అమరావతి ప్రధానవీధిలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద భక్తులకు విద్యుత్ వెలుగులతో స్వాగత తోరణాలతోపాటు రోడ్డు కిరువైపులా విద్యుత్ తోరణాలను ఏర్పాటు చేసి దేవాలయానికి రాజగోపురానికి విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేయటంతో ఆలయంగా శోభాయమానంగా ఉంది.
డిసెంబర్ 14న మెగా లోక్‌అదాలత్
రేపల్లె రూరల్: కక్షిదారుల సమయం, ధనం వృథా కాకుండా రాజీపడదగిన కేసులను పరిష్కరించేందుకే డిసెంబర్ 14న మెగా లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి టీ.వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక సబ్‌కోర్టు హాలులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. లోక్‌అదాలత్‌లో సివిల్, క్రిమినల్, ప్రీలిటికేషన్ కేసులను పరిష్కరిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో వివిధ బ్యాంక్‌ల ప్రతినిధులు, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయ సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
మద్యం షాపు వద్దు
వేటపాలెం: నివాసాల మధ్య మద్యం షాపు వద్దంటూ మహిళలు శనివారం అడ్డుకున్నారు. స్థానిక సంతారావూరు రోడ్డు, చీరాల–వేటపాలెం రోడ్డులో సెంటర్‌కి దగ్గరలో నివాస గృహాల మధ్య ఏర్పాటు చేయ తలపెట్టిన మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని స్థానిక మహిళలు ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. షాపు ఏర్పాటు చేయతలపెట్టిన యజమానులకు.. ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందు కున్న ఎస్సై సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులకు సర్ది చెప్పి విరమింపజేశారు.
శతాధిక వృద్ధురాలు మృతి
తెనాలిరూరల్: మండల పరిధిలోని కొలకలూరు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు ప్రసాదం తిరుపతమ్మ(107) శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. ఆమెకు ముగ్గురు కుమారులు. ఆమె కుమారుడు ప్రసాదం భాస్కరరావు కొలకలూరు గ్రామ మాజీ సర్పంచ్‌గా పనిచేశారు. మిగిలిన ఇరువురు కుమారులు వివిధ వ్యాపారాలలో ఉన్నారు. మనుమడు ప్రసాదం సురేష్ మొండిబండ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ నాయకుడిగా ఉన్నారు. తిరుపతమ్మ భర్త ముసలయ్య కూడా దాదాపు 98 సంవత్సరాలు జీవించి పదేళ్ల కిందట మృతి చెందారు. తిరుపతమ్మ మృతికి పలువురు మొండిబండ సంఘ నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, గ్రామస్తులు నివాళులర్పించారు. ఆమె అంత్యక్రియలు శనివారం సాయంత్రం ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment