మూడేళ్లు కావస్తున్నా పాత జిల్లా పేరే..!
ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపై ఇంకా గుంటూరు జిల్లాగానే..
నాదెండ్ల: రాష్ట్రంలో జిల్లాల విభజన జరిగిన మూడేళ్లు కావస్తున్నా ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపై ఇంకా పాత గుంటూరు జిల్లాగానే ఉంచడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 2022లో జిల్లాల పునర్విభజనలో భాగంగా గుంటూరు జిల్లా విభజన చెంది పల్నాడు జిల్లాగా రూపాంతరం చెందింది. నూతన జిల్లాల పేర్లను ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపై పొందుపరచాలని అప్పట్లోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పలుమార్లు జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు మండల, గ్రామస్థాయి అధికారులకు సర్క్యులర్లు జారీ చేశారు. అయితే పల్నాడు జిల్లా మేజర్ పంచాయతీ గణపవరం గ్రామంలోని 1, 2 సచివాలయాల బోర్డులపై ఇప్పటికీ గుంటూరు జిల్లా పేరు కనిపిస్తుంది. పల్నాడు జిల్లా పేరు నమోదు చేయకపోవటం స్థానిక అధికారుల నిర్లక్ష్యానికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇటీవల జిల్లా పంచాయతీ అధికారి మండలంలో పర్యటించినపుడు ఓ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం బోర్డుపై పల్నాడు జిల్లా బదులు గుంటూరు జిల్లా పేరు ఉండటంపై సీడీపీఓకు మెమో జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సదరు అధికారిణి వెంటనే అన్ని అంగన్‌వాడీ కేంద్రాల బోర్డులపై పల్నాడు జిల్లా పేరును మార్పుచేయించారు. ఇప్పటికీ గ్రామాల్లోని పలు ప్రభుత్వ కార్యాలయాల బోర్డులపై జిల్లా పేరు మార్చకపోవటం శోచనీయం.
Comments
Please login to add a commentAdd a comment