ఆనంద ల‘హరి’
తెనాలి: వైకుంఠపురంలో కొలువై ఉన్న శ్రీలక్ష్మీ పద్మావతీసమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం శ్రీవారి తెప్పోత్సవం భక్తజన సందోహం నడుమ వైభవంగా జరిగింది. ఏటా మకర సంక్రాంతి పండగ రోజున స్వామి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం ఐదు గంటలకు స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ఆలయం వద్ద నుంచి అధికారులు ఊరేగింపుగా వెలుపలికి తీసుకొచ్చారు. నిజాంపట్నం కాలువలో ముత్యంశెట్టిపాలెం వంతెన వద్ద ప్రత్యేకంగా అలంకరించిన విద్యుద్దీపాలతో కూడిన హంస వాహన పడవలో స్వామి, అమ్మ వార్ల ఉత్సవమూర్తులను ఉంచారు. అర్చకులు రత్నాకరం సత్యనారాయణ గౌతమ, అళహరి రవికుమార్‌లు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకంగా అలంకరణలు విశేష పూజలు చేశారు. ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, పాలకవర్గ సభ్యులు నేతృత్వంలో అర్చకులు పూజలు జరిపించారు. ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొబ్బరికాయ కొట్టి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో పాల్గొని స్వామిని దర్శించుకోవటం తన అదృష్టమన్నారు. ఏటా స్వామి తెప్పోత్సవం వైభవంగా జరుగుతుందని, పట్టణంలో మూడు కాల్వలు ఉండటం, పడవలో స్వామి ఉత్సవం జరగటం తెనాలికి ప్రత్యేక ఆకర్షణగా చెప్పారు. తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు సాయంత్రం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ముత్యంశెట్టిపాలెం వంతెన వద్దకు చేరుకున్నారు. పడవలో ఓవైపు స్వామి అమ్మవార్లు కూర్చుని తెప్పోత్సవంలో విహరిస్తుండగా, మరోవైపు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. పట్టణానికి చెందిన ప్రముఖ నర్తకి, నృత్యగురువు ఆరాధ్యుల తేజస్విప్రఖ్య బృందం కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించారు. తెప్పోత్సవం అక్కడ్నుంచి బయలుదేరి కొత్త వంతెన, మార్కెట్ వంతెన, గంగానమ్మపేట వంతెన వరకూ కొనసాగింది. దారి పొడవునా కాలువకు ఇరువైపులా జక్తజనం నిలబడి భక్తిశ్రద్ధలతో తెప్పోత్సవాన్ని వీక్షించారు. ట్రాఫిక్‌పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావు నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.
వైభవంగా వైకుంఠపురవాసుని తెప్పోత్సవం
Comments
Please login to add a commentAdd a comment