దారి మళ్లిన రూ.9.24 కోట్లు
నెహ్రూనగర్: విజయవాడ బుడమేరు వరద బాధితులకు సాయం పేరిట గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు రూ.9.24 కోట్ల నిధులను పక్కదారి పట్టించారని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం కౌన్సిల్ హాల్ వద్ద విలేకర్ల సమావేశంలో డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 4వ తేదీన వాయిదా పడిన కౌన్సిల్ సమావేశాన్ని తిరిగి నిర్వహించాలని కమిషనర్‌కు 8, 16వ తేదీలలో లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. కమిషనర్‌కు ఫోన్ చేసినా, కార్యాలయ అధికారిని పంపించినా స్పందించకపోవడంతో శుక్రవారం కౌన్సిల్ హాల్ వద్ద నిరసనగా ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. కమిషనర్ తీరు కౌన్సిల్‌ను అపహాస్యం చేయడమేనని పేర్కొన్నారు. అవినీతి బయటకు వస్తుందన్న భయంతో హడావిడిగా స్టాండింగ్ కమిటీ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారని మండిపడ్డారు. ఫిబ్రవరి 3వ తేదీ వరకు సమావేశం పెట్టకుంటే తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, అలా సమస్య సమసిపోతుందని అనుకుంటే పొరపాటేనన్నారు. దోచుకున్న సొమ్ముకు సంబంధించి అధికారులు సమాధానం చెప్పాల్సిందేనని పేర్కొన్నారు.
అధికారుల ఖాతాలకు నగదు జమ
డెప్యూటీ మేయర్ ప్రశ్న వేస్తే అధికారులు నామమాత్రంగా సమాధానం ఇచ్చారన్నారు. ఈఈ కోటేశ్వరరావు బ్యాంకు ఖాతాకు రూ.కోటి, మరో ఈఈకి రూ.50 లక్షలు, ఇతర ఏఈలు, డీఈలకు రూ.లక్షలు వంతున మొత్తం రూ.9.24 కోట్లు కమిషనర్ చెల్లించారని పేర్కొన్నారు. కౌన్సిల్‌కు తాము వస్తున్నామని తెలిసి పోలీసు బందోబస్తు కావాలని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కావాలనే కమిషనర్ రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నట్లు ఆరోపించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, డెప్యూటీ సీఎంకు, మున్సిపల్ శాఖ మంత్రికి, క్యాట్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కౌన్సిల్ ఏర్పాటు విషయంలో న్యాయపరంగా పోరాడతామని పేర్కొన్నారు. బుడమేరు వరద బాధితులకు సాయంలో నిధుల గోల్‌మాల్ లెక్క తేలుస్తామని స్పష్టం చేశారు.
అవినీతి బయటపడుతుందనే భయాందోళనలో జీఎంసీ కమిషనర్
సభ్యుల ప్రశ్నలకు సమాధానం
చెప్పలేకనే కౌన్సిల్ సమావేశంపై
తాత్సారం
అందుకే హడావిడిగా స్టాండింగ్
కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
గుంటూరు నగర మేయర్
కావటి మనోహర్ నాయుడు
Comments
Please login to add a commentAdd a comment