సమాజాన్ని మేల్కొలిపేవే నాటికలు
యద్దనపూడి: నాటికల్లోని పాత్రల్లో ప్రేక్షకులు తమను తాము చూసుకోవటం ద్వారా సామాజిక చైతన్యం పెరుగుతుందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మండలంలోని అనంతవరం గ్రామంలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలలో భాగంగా మూడో రోజైన శుక్రవారం ప్రదర్శించిన నాటిక పోటీలు ఆద్యంతం ప్రేక్షకులను రంజింపజేశాయి. తొలుత ఎమ్మెల్యే జ్యోతిప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో టీవీ విశ్లేషకులు ఇడుపులపాటి సాంబశివరావు, తెలుగు టీవీ నిర్మాతల మండలి అధ్యక్షుడు ఆరెకట్ల ప్రసాద్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే పుల్లారావు మాట్లాడుతూ కళాపరిషత్‌ల ద్వారా నాటికల పోటీలు నిర్వహించి కళాకారులను అభినందిస్తూ గౌరవించడం అభినందనీయమని కొనియాడారు. ఆరెకట్ల ప్రసాద్ మాట్లాడుతూ సినిమా రంగంతో సమానంగా నాటక రంగానికి ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాటకాల ద్వారా సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక అంశాలు ఎన్నో మిళితమై ఉంటాయన్నారు. సీ్త్ర ఔనత్యాన్ని ఇనుమడింపజేసేలా మంచి నాటకాలు రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇడుపులపాటి సాంబశివరావు మాట్లాడుతూ గతంలో గ్రామీణ ప్రాంతాల్లో టీవీలు, సినిమాలు లేని రోజుల్లో కాలక్షేపం కోసం నాటికలు ప్రదర్శించేవారని, అలాంటి సమయంలో చదువుతో సంబంధం లేకుండా ఎన్నో నాటక పద్యాలను ప్రజలు అలవోకగా చెప్పేవారంటే నాటకాలపై ప్రజలకు ఉన్న మక్కువ ఎంతో తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో అనంతవరం కళాపరిషత్ అధ్యక్షుడు గుదే పాండురంగారావు, గుదే తారకరామారావు, మద్దినేని జయరామకృష్ణ, పెడవల్లి శ్రీనివాసరావు, పోపూరి శివసుబ్బారావు, నిమ్మల సాంబశివరావు, పెడవల్లి వెంకటేశ్వర్లు, మండవ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నైతిక విలువలు పెంచుకుంటేనే మనుగడ
తొలినాటికగా ఏది నిజం ప్రదర్శితమైంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైన అభివృద్ధి ఒక వైపు, దేశానికే తలమానికమైన కుటుంబ వ్యవస్థలో సంబంధ బాంధవ్యాలు, నైతిక విలువలు రోజురోజుకు క్షీణించిపోతున్న నేపథ్యంలో ఈ రెండు అంశాలు ప్రాతిపాదికన ఏది నిజమైన అభివృద్ధి ఉండాలో తెలుసుకోవాలని సందేశం ఇచ్చింది ‘ఏది నిజం’. ఈ నాటికను శ్రీకారం రోటరీ కళాపరిషత్ మార్టూరు వారు ప్రదర్శించారు.
సాయం అందించడమే జీవిత పరమార్థం
స్నేహ ఆర్ట్స్ వింజనంపాడు వారిచే ‘కొండంత అండ’ నాటికలో చేలో పంటకు పట్టిన చీడను వదిలించుకోవటమే రైతు బాధ్యత అని, ప్రకృతి బీభత్సాలకు రోదించటమే రైతు వంతని అనుకోకుండా సమాజంలో జరిగే అవకతవకలను సరిచేసుకుంటూ సమస్యలకు ఎదురొడ్డి పోరాడుతూ స్వార్థపూరిత మనస్తత్వాలను సరిచేస్తూ, తోటి మనుషులకు తోడూనీడగా ఉండటమే జీవిత పరమార్థమని నమ్మిన ఓ రైతు కథ ఇది.
ఏది నిజం నాటికలోని సన్నివేశం
టెక్నాలజీనే మిత్రుడు, శత్రువు..
యువభేరి థియేటర్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ వారిచే ‘నా శత్రువు’ అనే నాటికలో నేడు మనిషి మనుగడ టెక్నాలజీతో ముడిపడిపోయింది అనటంలో సందేహమే లేదు. ఎవరికి వారు సెల్‌ఫోన్‌తో బిజీగా గడుపుతూ బంధాలకు, అనుబంధాలకు దూరమై ఎవరికి వారు ఒంటరై పోతున్నారు. టెక్నాలజీని అవసరానికి మాత్రమే వాడితే దానికి మించిన మంచి మిత్రుడు మరొకరు ఉండరని అవసరం ఉన్నా లేకున్నా అదే లోకంగా భావిస్తూ వెళితే మాత్రం ఊహించని ప్రమాదాలు జీవితంలో సంభవిస్తాయని తెలియజేప్పే నాటికే నా శత్రువు.
Comments
Please login to add a commentAdd a comment