విఘ్నేశ్వరునికి సంకటహర చతుర్ధి పూజలు
అమరావతి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరస్వామి ఉపాలయంలో శుక్రవారం సంకటహర చతుర్ధి పూజలను నిర్వహించారు. ఆలయ అర్చకస్వామి జగర్లపూడి శేషసాయిశర్మ విఘ్నేశ్వర స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామికి వివిధ రకాల పుష్పాలతో, గరికెతో విశేషాలంకారం చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామికి ప్రత్యేక పూజలు చేసి ఉండ్రాళ్లను సమర్పించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
వేగంగా అభయాంజనేయ స్వామి విగ్రహం నిర్మాణం
క్రోసూరు: క్రోసూరు శివారులోని ప్రధానరహదారిపై చెరువుకట్ట వద్ద అభయాంజనేయస్వామి విగ్రహ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు రూ.20 లక్షల అంచనాతో నిర్మితమవుతున్న అభయాంజనేస్వామి విగ్రహం, మండపాలను మార్చి నెలలో ప్రారంభానికి సిద్ధం చేస్తున్నట్లు కమిటీ తెలిపింది. క్రోసూరు గ్రామానికి అన్ని శుభాలు కలిగించాలన్న గ్రామస్తుల కోరిక మేరకు 30 అడుగుల అభయాంజనేయ విగ్రహాన్ని విగ్రహ కమిటీ సిద్ధం చేస్తోంది.
ముగిసిన పౌరాణిక,
సాంఘిక నాటకాలు
వినుకొండ(నూజెండ్ల): సంక్రాంతి సందర్భంగా వినుకొండ మండలంలోని పెద్దకంచర్ల గ్రామంలో గ్రామీణ కళాపరిషత్, రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పౌరాణిక సాంఘిక నాటకాలు శుక్ర వారంతో ముగిశాయి. చింతామణి, సత్యహరి శ్చంద్ర నాటకాలతోపాటు చివరి రోజున రాజ రాజ సుయోధన అనే పౌరాణిక రూపకం ప్రేక్షకులను అలరించింది. సుయోధనుడిగా ముత్తినేని గిరిబాబు, ఇతర పాత్రల్లో గుమ్మా శ్రీకాంత్ రెడ్డి రోటరీ క్లబ్ వారు నటన కౌశలంతో ప్రేక్షకులను అలంరించారు. అనంతరం వివిధ పాత్రల్లో నటించిన కళాకారులను సత్కరించారు.
20 నుంచి రాష్ట్రస్థాయి
ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
దుర్గి: శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 71వ వార్షిక కల్యాణ మహోత్సవం సందర్భంగా దుర్గిలో ఈనెల 20 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు శుక్రవారం నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు వివరించారు. వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
నిందితులకు జరిమానా
నరసరావుపేటటౌన్: అనధికారికంగా ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజక్షన్లు కలిగి ఉన్నట్లు నేరం రుజువు కావడంతో హైదరాబాద్‌కు చెందిన ఒ.సుబ్రమణ్యం రెడ్డి, నరసరావుపేటకు చెందిన షేక్ సైదాలకు ఒక్కొక్కరికి రూ 10,000, రెండు ట్రాన్స్‌పోర్ట్ సంస్థలకు మరో రూ.20,000, మొత్తం రూ.40 వేలు జరిమానా విధిస్తూ స్థానిక మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయాధికారి టి.ప్రవళిక శుక్రవారం తీర్పు వెలువరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 2012 నవంబర్ 22న అప్పటి నరసరావుపేట డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఎం.చంద్రశేఖరరావు పట్టణంలోని సాయి దత్త లారీ సర్వీస్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 11 బాక్సుల ఆక్సిటోసిన్ హార్మోన్ ఇంజక్షన్లు అనధికారికంగా కలిగి ఉన్నట్లు గమనించారు. ఈ ఔషధాలు హైదరాబాద్‌కు చెందిన సాయి దత్త లారీ సర్వీస్ నుంచి పట్టణంలోని దాని అనుబంధ సంస్థ కార్యాలయానికి వచ్చినట్లు గమనించారు. వాటికి వేబిల్స్ కానీ లైసెన్సులు కానీ, రికార్డులు కానీ లేకపోవడంతో ట్రాన్స్‌పోర్టు సంస్థలపై వాటి నిర్వాహకులపై అధికారులు కేసు నమో దు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైవిధంగా కోర్టు తీర్పు వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment