ఉత్సాహంగా ముగ్గుల పోటీలు
వేటపాలెం: సంక్రాంతి పురస్కరించుకొని రెడ్డి జన సేవా సంఘం ఆధ్వర్యంలో కొత్తపేటలోని శ్రీనగర్ కాలనీ రెండో వీధిలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, ప్రముఖ యాంకర్ ఆరే శ్యామల రెడ్డి, ప్రసన్న, రమాదేవి న్యాయనిర్ణేతలగా వ్యవహరించారు. పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందించారు. రెడ్డి జన సంఘ సభ్యులు, రెడ్డి జన సేవా సంఘ ప్రెసిడెంట్ జి. అనిల్ కుమార్ రెడ్డి, సెక్రటరీ బి. జయ భారత రెడ్డి, ట్రెజరర్ బి. వెంకటేశ్వర్ రెడ్డి, బత్తల బ్రహ్మారెడ్డి, శ్యామ్, శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
24న చేనేత కార్మికుల ధర్నా
భట్టిప్రోలు (కొల్లూరు): చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మురుగుడు సత్యనారాయణ కోరారు. భట్టిప్రోలులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ధర్నా కరపత్రాలను నాయకులతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత రంగంలో ఏళ్ల తరబడి నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న చీరాలలోని చేనేత, జౌళీ శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి 15 డిమాండ్లను పరిష్కరించాలని ఆయన విన్నవించారు. కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దీపాల సత్యనారాయణ, మండల కమిటీ సభ్యులు బట్టు నాగమల్లేశ్వరరావు, ఆకురాతి శ్రీనివాసరావు, గోపాలస్వామి, పోలిశెట్టి శంకరరావు పాల్గొన్నారు.
కుర్చీలాట ఆడుతూ.. కుప్పకూలిన మహిళ
● చికిత్సకోసం తరలిస్తుండగా మృతి
ఫిరంగిపురం: సంక్రాంతి సంబరాల సందర్భంగా ఏర్పాటు చేసిన కుర్చీలాట పోటీల్లో పాల్గొన్న మహిళ ఆటఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి కొంతసేపటిలో మృతిచెందిన సంఘటన మండలంలోని 113 తాళ్లూరు గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. సంక్రాంతి సంబరాల సందర్భంగా గ్రామంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద పలు రకాల ఆటల పోటీలు ఏర్పాటు చేశారు. కాగా గ్రామానికి చెందిన కొండా రాజ్యలక్ష్మి(35) కుర్చీలాట పోటీల్లో పాల్గొంది. కొద్దిసేపు ఆడిన తరువాత ఒక్కసారిగా కూలపడిపోయింది. దీంతో స్థానికులు స్పందించి 108 వాహనంలో చికిత్సకోసం గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు వాహన సిబ్బంది తెలిపారు. గుండెకు సంబంధించి అస్వస్థతకు లోనయి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. కాగా మృతురాలి భర్త సాంబిరెడ్డి పొలం పనులు చేస్తుంటాడు. మృతురాలికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment