ఒక్క రాత్రిలో 15 చోరీలు
దొంగల ముఠా స్వైరవిహారం
గురజాల: దొంగల ముఠా స్వైరవిహారం చేసింది. ప్రజలంతా సంక్రాంతి సందడిలో ఉండగా ఒక్కరాత్రిలో గురజాల, దాచేపల్లి మండలాల్లో ఏకంగా 15 చోరీలకు తెగబడింది. ఈ చోరీలు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇంటికి తాళాలు వేసు కుని పండగకు ఊరు వెళ్లిన కుటుంబాలనే దొంగలు టార్గెట్ చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఈ చోరీలు జరిగినట్టు సమాచారం. గురజాలలోని కోతమిషన్ సెంటర్‌లో రెండు ఇళ్ల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు బీరువాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడవేశారు. అలాగే పులిపాడు గ్రామంలో ఐదు ఇళ్లుతోపాటు ఒక షాపులో చోరీకి తెగబడ్డారు. దాచేపల్లి మండలం నడికూడిలో ఐదు ఇళ్లు, శ్రీనివాసరావుపేటలోని రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. పోలీసులను పక్కదారి పట్టించేందుకు దొంగల ముఠా యత్నించింది. దీనికోసం గురజాలలోని న్యాయవాది ఇంటిలో చోరీచేసిన హ్యాండ్ బ్యాగ్‌ను నడికూడిలోని ఓ ఇంటిలో, ఎక్కడో దొంగతనం చేసిన పర్సును న్యాయవాది ఇంటిలో వదిలి వెళ్లింది.
ఫలించిన పోలీసుల అప్రమత్తత
సంక్రాంతి సెలవుల ముందు నుంచే పోలీసులు ప్రజల్లో చోరీలపై అవగాహన కల్పించడంతో గ్రామీణులు అప్రమత్తమయ్యారు. ఇళ్లల్లో ఎక్కువ బంగారం, నగదు ఉంచుకోలేదు. ఫలితంగా దొంగల ముఠా 15 ఇళ్లలో చోరీ చేసినా మొత్తమ్మీద కేవలం రూ.1.50 లక్షల సొత్తును మాత్రమే చోరీ చేయగలిగిందని సమాచారం. చోరీలు జరిగిన ఇళ్లలో బుధవారం రాత్రి క్లూస్ టీం పరిశీలించింది. ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో సీఐ భాస్కర్ పర్యవేక్షణలో క్లూస్‌టీం వేలిముద్రలు సేకరించింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. క్లూస్ టీం ద్వారా నిందితుల వేలిముద్రలు సేకరించామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment