జాతీయ జెండా
ఏది సారూ..!
నరసరావుపేట: జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు వచ్చే వారికి స్వాగతం పలుకుతూ గుంటూరు రోడ్డు శివారులోని ఆజాదీ పార్కు మధ్యలో ఏర్పాటుచేసిన జాతీయ జెండాను మున్సిపల్ అధికారులు తొలగించి నెలన్నర అవుతుంది. ఇప్పటివరకు మళ్లీ ఏర్పాటు చేయలేదు. అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆలోచన మేరకు సుమారు రూ.12 లక్షల మున్సిపల్ నిధులతో 2022 ఆగస్టు 14వ తేదీన 100 అడుగుల స్తంభం(పోల్)పై జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, అప్పటి కలెక్టర్ లోతేటి శివశంకర్, ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. చూపరులకు సుమారు ఒక కిలోమీటరు దూరం నుంచే జాతీయ జెండా కన్పిస్తూ ఉండేది. అలాంటి జెండాను నెలన్నర క్రితం ఏ కారణంచేతనో తొలగించిన అధికారులు మళ్లీ ఏర్పాటు చేయలేదు. పార్కులోని మొక్కలు కూడా ఎండిపోయాయి. గత ప్రభుత్వంలో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి నిత్యం ఈ పార్కును పర్యవేక్షిస్తూ ఉండేవారు. రాష్ట్రంలో అధికారం మారగానే ఆ ఉద్యోగిని తొలగించారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని పట్టణ పౌరులు కోరుతున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావును వివరణ కోరగా జెండా చిరిగిందనే ఫిర్యాదుపై తొలగించామని, త్వరలో మళ్లీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment