‘కిక్కు’రుమనరే!
కూటమి ప్రభుత్వంలో మద్యం అస్తవ్యస్త విధానాల వల్ల వైన్స్ బార్లుగా మారుతున్నాయి. పర్మిషన్ లేకుండానే పర్మిట్ రూములు వెలుస్తున్నాయి. అనుమతుల్లేకుండానే టచ్చింగ్ వంటి అమ్మకాలు సాగుతున్నాయి. ఎకై ్సజ్ అధికారుల కళ్ళకు గంతలు కడుతూ గోవా, తెలంగాణ, హర్యానా మద్యం బాటిళ్లు యథేచ్ఛగా వస్తున్నాయి. మాచర్లలో మద్యం చుక్కలు లెక్క తప్పి ప్రభుత్వ గజానాకు గండి పెడుతున్నాయి.
నరసరావుపేటటౌన్: మాచర్లలో మద్యం వ్యాపారులు బరితెగించారు.. పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నారు. ఇతర రాష్ట్రాల మద్యాన్ని దుకాణాల్లో బహిరంగంగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తంతు యథేచ్ఛగా జరుగుతున్నా నివారణకు చర్యలు చేపట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు మాముళ్ల మత్తులో జోగుతున్నారు. మాచర్ల పట్టణంలో ప్రధానంగా రాయవరం జంక్షన్, రింగ్ రోడ్డు, స్టేషన్ రోడ్డు, అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని వైన్స్‌ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దుకాణాల వద్ద గ్రీన్ మ్యాట్‌లు అడ్డుగా కట్టి అక్కడ నిబంధనలకు విరుద్ధంగా సిట్టింగ్ ఏర్పాటు చేశారు. మద్యం తాగేందుకు వచ్చే మందు బాబులకు సకల సౌకర్యాలు అందిస్తున్నారు. దీంతోపాటు మద్యం దుకాణాలకు ఎదుట రోడ్లపై మందుబాబులు బహిరంగంగా మద్యం తాగుతున్నారు. కూలింగ్ వాటర్ క్యాన్ల ద్వారా లూజ్ వాటర్, గ్లాసులు దుకాణాల ఎదుట విక్రయిస్తున్నారు. దీంతో మందుబాబులు వైన్స్‌ల్లో మద్యం కొనుగోలు చేసి అక్కడే తాగుతున్నారు. మద్యం వ్యాపారులంతా అధికార పార్టీకి చెందిన వారు కావటంతో యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. దీంతోపాటు ఒక్కో దుకాణం నుంచి నెలకు రూ.50 వేలు అధికారులకు మామూళ్లు అందుతున్నట్లు వ్యాపారులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
యథేచ్ఛగా ఇతర రాష్ట్రాల మద్యం అమ్మకం
మాచర్ల నియోజకవర్గంలో ఇతర రాష్ట్రాల మద్యం యథేచ్ఛగా లభిస్తోంది. గోవా, హర్యానా రాష్ట్రాల నుంచి అక్రమార్కులు మద్యాన్ని తీసుకొచ్చి వాటిని ఆంధ్రరాష్ట్రానికి చెందిన బాటిళ్లలో నింపి విక్రయాలకు పాల్పడుతున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో యథేచ్ఛగా గోవా మద్యాన్ని విక్రయిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇటీవల వెల్దుర్తి మండలంలో గోవా మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కొన్ని వైన్స్‌ల్లో గోవా మద్యాన్ని లేబుళ్లు మార్చి విక్రయిస్తున్నట్లు సమాచారం.
ఎనీటైం మందు..
వైన్స్‌లలో పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలు మద్యం అమ్ముతున్నారు. మద్యం దుకాణాల షెటర్లు మూసి వేసి చిన్న కంత పెట్టి అందులో నుంచి రాత్రుళ్లు మద్యం విక్రయాలకు పాల్పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిబంధనల ప్రకారం మద్యాన్ని దుకాణాల్లో విక్రయించాలి. అయితే యథేచ్ఛగా రాత్రింబవళ్లు దుకాణాలు తెరిచి ఉన్నా అధికారులు ఆవైపు కన్నెత్తి కూడా చూడరు. మద్యం తాగి రాత్రుళ్లు మందు బాబులు చేస్తున్న గొడవలతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.
మామూళ్ల మత్తులో అధికారులు
మాచర్లలో బారుల్లా వైన్స్ ఇతర రాష్ట్రాల మద్యమూ అమ్మకం నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్స్ కన్నెత్తి చూడని ఎకై ్సజ్ అధికారులు
బెల్టు షాపులకు సరఫరా..
మాచర్ల పట్టణంలోని మూడు మద్యం దుకాణాల నుంచి బెల్టు షాపులకు మద్యం సరఫరా అవుతోంది. ప్రతిరోజూ గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపులు నిర్వహించే వారు పట్టణానికి వచ్చి పెద్ద మొత్తంలో మద్యం కొనుగోలు చేసుకొని పోతున్నారు. కొందరు వైన్స్ నిర్వాహకులు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు. ఒక్కో క్వార్టర్‌కు ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా బెల్టు షాపుల నిర్వాహకులకు మద్యం దుకాణా నిర్వాహకులు విక్రయిస్తున్నారు. ఆ మద్యాన్ని గ్రామాల్లో క్వార్టర్‌కు రూ.50 అదనంగా విక్రయించి బెల్టు షాపుల వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment