ఎయిమ్స్‌లో ఆగిన పసిగుండె
మంగళగిరి (తాడేపల్లిరూరల్): మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ పాప చనిపోయిందంటూ బుధవారం తల్లిదండ్రులు మంగళగిరి రూరల్‌పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితుల కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన కొత్తం గంగరాజు, కుమారి దంపతులకు పెళ్లయిన ఆరు సంవత్సరాల తరువాత పాప జన్మించింది. ఆ పాపకు తన్విశ్రీ (14 నెలలు) అని పేరు పెట్టుకున్నారు. ఇంటి దగ్గర ద్విచక్రవాహనం పైనుంచి కిందపడి మెడలోపలి భాగంలో స్వల్ప గాయమైంది. లేకలేక పుట్టిన బిడ్డకు దెబ్బ తగలడంతో తల్లిదండ్రులు స్థానిక కార్పొరేట్ ఆసుపత్రిలో చూపించగా, వారు మంగళగిరిలోని ఎయిమ్స్‌కు తీసుకువెళ్లమని సూచించడంతో మూడు రోజుల కిందట ఇక్కడకు తీసుకువచ్చారు. సోమవారం ఎయిమ్స్‌కు రాగా వైద్యులు పరీక్షించి రెండు సిరప్‌లు ఇచ్చి, ఇంటికి వెళ్లి బుధవారం రమ్మని చెప్పారు. పాపకు దెబ్బతగిలినా ఆడుకుంటూ నవ్వుతూ ఉండేదని తల్లిదండ్రులు తెలిపారు. అయితే బుధవారం మళ్లీ ఆస్పత్రికి రాగా పాపకు స్కానింగ్ తీయాలని చెప్పి లోపలికి తీసుకు వెళ్లారు. తొలుత స్కానింగ్ తీసి, అనంతరం ఎంఆర్‌ఐ స్కానింగ్ అంటూ పాపకు మత్తు ఇచ్చారని తల్లిదండ్రులు తెలిపారు. రెండు మూడు సార్లు స్కానింగ్ తీసినా సరిగా రాకపోవడంతో మళ్లీ పాపకి మత్తు ఇంజక్షన్ ఇచ్చారని, అరగంట తరువాత పాప స్కానింగ్ మిషన్‌లోనే చనిపోయిందని చెబుతున్నారని, క్యాన్సర్ అని వైద్యులు తెలిపారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
●పాప చనిపోకముందు జూనియర్ డాక్టర్లు వైద్యం అందించగా, పాప మృతితో సీనియర్ వైద్యులు వచ్చి పరిశీలించి చనిపోయిందని నిర్ధారించారు. అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్న పాప ఎలా చనిపోయిందని అడగడంతో డాక్టర్లు మాకు తెలియని భాషలో ఏదేదో చెబుతూ మమ్మల్ని బయటకు వెళ్లమని చెప్పారని తల్లిదండ్రులు ఇద్దరూ పోలీస్‌స్టేషన్ ముందు కన్నీరు మున్నీరుగా విలపించారు. అసలు ఏ పరీక్షలు చేయకుండా క్యాన్సర్ అని ఎలా నిర్ధారించారో తమకు తెలియజెప్పాలని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశామని, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తండ్రి గంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సామాజిక మాధ్యమాల్లో ఎయిమ్స్ హాస్పిటల్‌లో పాప ఎవరూ చనిపోలేదని, ఇలాంటి సంఘటనలు ఎవరూ నమ్మవద్దని ప్రచారం నిర్వహిస్తున్నారు. జరిగిన ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందని ఆరోపణలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తల్లిదండ్రులు లేకలేక పుట్టిన బిడ్డను చంపేసి, ఇప్పుడు క్యాన్సర్ అంటున్నారని ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment