చీటింగ్ కేసులో యువకుడి అరెస్టు
సత్తెనపల్లి: ఉద్యోగాలు ఇప్పిస్తానని చీటింగ్ చేసే యువకుడ్ని పల్నాడు జిల్లా సత్తెనపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పట్టణ పోలీస్టేషన్‌లో నిందితుడి వివరాలను పట్టణ సీఐ బి.బ్రహ్మయ్య వెల్లడించారు. వివరాలు ఇలా...చిత్తూరు జిల్లా సోమల మండలం తప్పన్నగారిపల్లి గ్రామానికి చెందిన అమాస భాను అలియాస్ పవన్ అలియాస్ రాజేష్ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. సులభ మార్గంలో డబ్బు సంపాదించేందుకు మోసాలు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో గతంలో రాజకీయ నాయకుల వద్ద పీఏగా పని చేశానని పలువురిని నమ్మించాడు. చాలా మంది నాయకులు తెలుసని, ఆ పలుకుబడితో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మోసాలు చేయడం ప్రారంభించాడు. అతనిపై చిత్తూరు జిల్లాలోనే పలు కేసులతో పాటు ఓ హత్య కేసులో చిత్తూరు జిల్లా సోమ్లా పోలీస్‌స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపారు. బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చినా కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. మళ్లీ గతంలో మాదిరిగానే ఉద్యోగాలను ఇప్పిస్తానని చీటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్న పల్నాడు జిల్లా గండ్లూరుకు చెందిన 2వ నిందితుడు నాగమల్లేశ్వరరావుతో పరిచయం ఏర్పడింది. అతని సహకారంతో సత్తెనపల్లి నియోజక వర్గంలోని రాజకీయ వాట్సప్ గ్రూప్‌లలో ఉన్న సభ్యుల ఫోన్ నంబర్లను సేకరించాడు. వారికి ఫోన్లు చేసి రాజమండ్రి, తిరుపతి, రేణుగుంట ఎయిర్ పోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఆన్‌లైన్ ద్వారా నగదు వేయించుకొని ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతనిపై సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. వాహనాల తనిఖీలు చేస్తుండగా అమాస భాను సత్తెనపల్లిలోని నరసరావుపేట రోడ్‌లో గల చెక్ పోస్ట్ వద్ద మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా సీఐ బ్రహ్మయ్య మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పిస్తానంటే నమ్మవద్దని తెలిపారు. సమావేశంలో సత్తెనపల్లి టౌన్ ఎస్‌ఐ ఎం.సంధ్యారాణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment