డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభం
పట్నంబజారు: డ్రైవర్లు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించాలని ఏపీఎస్ ఆర్‌టీసీ రీజియన్ మేనేజర్ ఎం.రవికాంత్ చెప్పారు. గుంటూరు జిల్లా పరిధిలోని హెవీమోటారు వెహికల్ డ్రైవింగ్ స్కూల్ 18 బ్యాచ్‌కు శిక్షణ తరగతులు గురువారం బస్టాండ్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ.. హెవీ డ్రైవింగ్ స్కూల్‌లో సీనియర్ డ్రైవర్ల చేత నాణ్యమైన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిపో –2 మేనేజర్, డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపల్ షేక్ అబ్దుల్‌సలాం పాల్గొన్నారు.
ద్విచక్ర వాహనం పై నుంచి పడి మహిళ మృతి
గురజాల: ద్విచక్ర వాహనంపై నుంచి పడి మహిళ మృతి చెందిన ఘటన మండలంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. దాచేపల్లి మండలం తక్కళ్లపాడు గ్రామానికి చెందిన పిందెబోయిన నాగలక్ష్మి(30) సంక్రాంతి పండుగ సందర్భంగా గురజాల మండలం గొట్టెముక్కల గ్రామానికి పుట్టింటికి వచ్చింది. పండుగ అనంతరం తిరిగి తన సోదరుడి ద్విచక్రవాహనంపై తక్కళ్లపాడు వెళ్తుండగా మార్గ మధ్యలో దైద గ్రామ సమీపంలో వాహనంపై నుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో నాగలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. నాగలక్ష్మిని గురజాల సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలికి భర్త ఇద్దరు పిల్లలున్నారు.
స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నోటిఫికేషన్
నెహ్రూనగర్: గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఫిబ్రవరి 3న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 3 వరకు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరుగుతాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక కాలపరిమితి గత సంవత్సరం ఆగస్టుతో ముగిసింది. ఇప్పటి వరకు ఉన్న సభ్యులతోనే స్టాండింగ్ కమిటీ నడిచింది. ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ ఓటర్ల లిస్టు 16వ తేదీన ప్రకటించామని, ఓటర్ల లిస్టు, నోటిఫికేషన్‌ను నగర పాలక సంస్థ నోటీసు బోర్డులో ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు ఉదయం 11– సాయంత్రం 3 గంటల వరకు నగర అదనపు కమిషనర్ చాంబర్‌లో నామినేషన్‌లు దాఖలు చేయవచ్చునన్నారు. 24న అందిన నామినేషన్ల ప్రకటన, 27న ఉదయం 11 – 12 గంటల వరకు నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుందని, అదే రోజు వ్యాలిడ్ నామినేషన్ల ప్రకటన ఉంటుందన్నారు. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 – సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, అనంతరం తుది పోటీలోని అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 3న ఉదయం 10.30 – సాయంత్రం 3 వరకు సమావేశ మందిరంలో ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు. అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment