అచ్చంపేట: స్థానిక శ్రీ తుమ్మేపల్లి శ్రీరాములు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000–01 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులంతా 25 సంవత్సరాల తరువాత కలుసుకున్నారు. పాఠశాలలో గురువారం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పూర్వ విద్యార్థులు పాఠశాల పరిసరాలు కలయతిరిగి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. అప్పటి విద్యార్థులంతా ఇప్పుడు వివిధ వృత్తులలో ఇంజినీర్లు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, లాయర్లు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారస్తులు, పారిశ్రామిక వేత్తలు, రైతులు, కాంట్రాక్టర్లు, తాపీమేసీ్త్రలు, గృహిణిలుగా.. ఇలా స్థిరపడ్డారు. ఇప్పటి వారి హోదాలగురించి పట్టించుకోకుండా పాఠశాలకు రాగానే వారంతా ఒక్కసారిగా విద్యార్థుల్లా మారిపోయారు. టెన్త్‌లో ఎవరు ఎక్కడ కూర్చునేవారు, ఎవరిపక్కన ఎవరు ఉండేవారో అలానే బల్లలపై కూర్చున్నారు. ఎవరు ఏం చేస్తున్నారో కుశల ప్రశ్నలు వేసుకున్నారు. చదువులు చెప్పిన నాటి ఉపాధ్యాయులందరిని పిలిచి దుశ్శాలువాలు, జ్ఞాపికలు, పూలమాలలతో ఘనంగా సన్మానించుకున్నారు. ఉపాధ్యాయుల దీవెనలతోనే తాము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటూ తమ తమ అనుభవాలను వ్యక్తపరచారు. ఆనాటి హెచ్‌ఎం గోళ్లమూడి పాపారావు, ఉపాధ్యాయులు చలపతిరావు, మార్కు మస్టారు, సాంబశివరావు, పీఈటీ కమతం శ్రీనివాసరావు, డ్రాయింగ్ టీచర్ మల్లేశ్వరి, తదితర గురువులతో కలసి సహపంక్తి భోజనాలు చేశారు. అప్పటి టెన్త్ చదివిన బ్యాచ్‌లో సుమారుగా 80 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. మిగిలిన 20 శాతంలో విదేశాలలో స్థిరపడినవారు, కొన్ని అనివార్య పరిస్థితులవల్ల రాలేనివారంతా ఫోన్లు ద్వారా పలుకరించుకుని గురువుల ఆశీర్వాదాన్ని పొందారు.
25 సంవత్సరాల తరువాత కలుసుకున్న పూర్వవిద్యార్థులు తుమ్మేపల్లి శ్రీరాములు జెడ్పీ హైస్కూల్‌లో 2000–01 బ్యాచ్ టెన్త్ విద్యార్థుల అ‘పూర్వ’ సమ్మేళనం
Comments
Please login to add a commentAdd a comment