వీరుల ఆయుధాలకు శాంతి క్రతువులు
కారెంపూడి: పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో కారెంపూడికి చెందిన కిల్లా కోటయ్య, కోటమ్మల కుటుంబీకులు తమ ఇళ్లలో ఉన్న పల్నాటి వీరుల ఆయుధాలకు శాంతి కార్యక్రమాలు నిర్వహించి పల్నాటి వీరాచారాన్ని గురువారం పునఃప్రతిష్ట చేసుకున్నారు. 60 ఏళ్ల క్రితంవరకు తమ పూర్వికులైన వీర్లకు పెట్టుకున్న ఆ కుటుంబీకులు ఆతర్వాత మానేసి తర్వాత మళ్లీ జరిగిన పొరపాటును గుర్తించి వీర్ల ఆయుధాలకు శాంతి కార్యక్రమాల క్రతువులు నిర్వహించారు. నాగులేరు ఒడ్డున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వీర్లగుడికి చేరుకుని అక్కడ పోతురాజుకు నైవేద్యం, ఇతర మొక్కులు చెల్లించారు. తర్వాత వీర్లగుడికి, తర్వాత చెన్నకేశవస్వామి, వీర్ల అంకాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇళ్లకు చేరుకుని ఇళ్లలో వీర్ల అంకాలమ్మ తల్లి బుట్టను కత్తులను పెట్టి సాంభ్రాణి వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో విశ్రాంత డీటీ రామకృష్ణారావు, ఎంపీపీ బొమ్మిన సావిత్రి అల్లయ్య పాల్గొన్నారు. కిల్లా పెదకోటేశ్వరరావు, చెన్నకేశవస్వామి మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్ కిల్లా చినకోటేశ్వరరావు వీర్ల ఆయుధాలకు శాంతి కార్యక్రమాలు చేశారు. వీర్ల గుడి పూజారులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కారెంపూడి రణక్షేత్రంలో వీరాచారాన్ని వదలివేసిన వారు మళ్లీ స్వీకరించడం ఇక్కడ విశేషం. గతంలో జక్కా కుటుంబీకులు వీర్లకు పెట్టుకుని పునః ప్రతిష్టకు శ్రీకారం చుట్టారు. తర్వాత రణక్షేత్రంలో ఇది రెండవ కార్యక్రమం.
Comments
Please login to add a commentAdd a comment