రాకోడు పీహెచ్‌సీలో గర్భిణికి ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ ఎక్కిస్తున్న దృశ్యం
● ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ) మెరుగుపడ్డ సేవలు
● అందుబాటులో 63 రకాల పరీక్షలు
● నాలుగున్నరేళ్లలో 77.29 లక్షల
మందికి వైద్యం
● మరో 24.46 లక్షల మందికి
రక్తపరీక్షలు
● జిల్లా వ్యాప్తంగా 48 ప్రాథమిక
ఆరోగ్య కేంద్రాలు
విజయనగరం ఫోర్ట్: ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నారు. నాడు–నేడు పథకం కింద ఇప్పటికే ఆస్పత్రులను అభివృద్ధి చేయగా, ఆ తర్వాత పీహెచ్‌సీల దగ్గర నుంచి ఏరియా ఆస్పత్రుల వరకు అన్నింట్లో వైద్యసిబ్బంది కొరత లేకుండా జాగ్రత్త వహించి, సకాలంలో జనానికి వైద్యసేవలు అందేలా చేసింది. దీంతో పాటు గ్రామాల్లోనే వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటు, ఫ్యామిలీ డాక్టర్ విధానం, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ రావడం జరుగుతోంది. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన తర్వాత గ్రామీణులకు ఆరోగ్య భరోసానిచ్చే పీహెచ్‌సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)ల్లో సమూలమైన మార్పులు వచ్చాయి. గతంలో టీడీపీ హయాంలో పీహెచ్‌సీల్లో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉండేవి. వైద్యులు, సిబ్బంది, మందుల కొరత విపరీతంగా ఉండేవి. ఇప్పుడు అవేవీ లేకుండా రోగులకు అవసరమైన సేవలన్నీ సకాలంలో లభిస్తున్నాయి. దీంతో జగనన్న పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు..
2019కు ముందు టీడీపీ హయాంలో ఒక పీహెచ్‌సీకి ఒక్క వైద్యుడు మాత్రమే ఉండేవారు. ఆ వైద్యుడు ఏదైనా పని నిమిత్తం సెలవు పెడితే చాలు ఆస్పత్రిని ఆశ్రయించే వారికి సేవలు కరువయ్యేవి. అటువంటి దుస్థితి ఉండకూడదన్న సదుద్దేశ్యంతో ఇప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. ఒక వైద్యుడు సెలవులో ఉంటే మరో వైద్యుడు కచ్చితంగా పీహెచ్‌సీలో అందుబాటులో ఉంటున్నారు. దీంతో ప్రజలకు అవసరమైన వైద్యసేవలు నిత్యం అందుతున్నాయి. ఇదిలా ఉండగా, గతంలో పీహెచ్‌సీలో ఒక స్టాఫ్‌నర్సు ఉంటే ఇప్పుడు ఏకంగా ముగ్గురు స్టాఫ్‌నర్సులు అందుబాటులో ఉంటున్నారు. వీరితో పాటు ఎంఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోను కూడా నియమించారు. ఇదివరకు రెండు, మూడు పీహెచ్‌సీలకు ఒకేఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటే, ప్రస్తుతం ప్రతి పీహెచ్‌సీకి ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నారు. గతంలో 10, 14 రకాల వైద్యపరీక్షలు మాత్రమే చేశారు. ప్రస్తుతం 63 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. అప్పట్లో 5, 10 పీహెచ్‌సీల్లో మాత్రమే 24 గంటల సేవలుండేవి. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న 48 పీహెచ్‌సీల్లోనూ 24 గంటల సేవలు అందుబాటులో ఉన్నాయి. గతంలో కొన్ని పీహెచ్‌సీల్లో మాత్రమే ప్రసవాలు చేసేవారు, ఇప్పుడు అన్ని పీహెచ్‌సీల్లోనూ ప్రసవాలు చేస్తున్నారు. ప్రసవానికి అవసరమైన గదులను ప్రతి పీహెచ్‌సీలో ఆధునీకరించారు.
జిల్లాలోని 48 పీహెచ్‌సీల్లో..
2019 నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 48 పీహెచ్‌సీల్లో 77.29 లక్షల మందికి వైద్యసేవలు అందించారు. అలాగే 24.62 లక్షల మందికి వైద్యపరీక్షలు చేశారు.
రాత్రి వేళల్లోనూ సేవలు..
ప్రభుత్వం చేపట్టిన నాడు–నేడు పథకం పనుల ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మారాయి. పీహెచ్‌సీలతో పాటు ప్రధాన ఆస్పత్రుల్లోనూ రోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్యసేవలు, వైద్యపరీక్షలు, అందుబాటులో ఉన్నాయి. రాత్రి వేళల్లోనూ ఇప్పుడు పీహెచ్‌సీల్లో సేవలందిస్తున్నాం.
– డాక్టర్ ఎస్.భాస్కరరావు, డీఎంహెచ్‌వో.
బాగా చూస్తున్నారు..
నాకు సుగర్ వ్యాధి ఉంది. ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. పీహెచ్‌సీలో ఇప్పుడు చాలా బాగా చూస్తున్నారు. డాక్టర్ పరీక్ష చేయించుకోమని చెప్పగానే ల్యాబ్‌కు వెళ్తే అక్కడి ల్యాబ్ టెక్నీషియన్ నాకు షుగర్ పరీక్ష చేసి, రిపోర్టు కూడా త్వరగానే ఇచ్చేశారు.
– చెల్లూరు కృష్ణమ్మ, పినవేమలి గ్రామం,
విజయనగరం మండలం.
Comments
Please login to add a commentAdd a comment