ప్రాణం తీసుకున్న ప్రేమికులు | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసుకున్న ప్రేమికులు

Published Sun, Jan 21 2024 12:56 AM | Last Updated on Sun, Jan 21 2024 12:16 PM

- - Sakshi

గరుగుబిల్లి: ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్నినెలలుగా ప్రేమలో మునిగిపోయారు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంలో విఫలమయ్యారు. వీరిలో ఒకరికి పెద్దలు వివాహం నిశ్చయం చేయడంతో మదనపడ్డారు. తల్లిదండ్రులకు ప్రేమవిషయం చెప్పేందుకు సాహసంచేయలేక, కలిసి బతికేందుకు ధైర్యంచాలక ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు తీసుకున్నారు. ప్రేయసి తోటపల్లి డ్యామ్‌ నుంచి నదిలో దూకి ప్రాణాలు విడవగా, ప్రియుడు రైలుకింద పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటనకు సంబంధించి ట్రైనీ డీఎస్పీ మహ్మద్‌ అజీజ్‌, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కొమరాడ మండల కేంద్రానికి చెందిన పద్మజ (24), పార్వతీపురం మండలం చినమరికి గ్రామానికి చెందిన వానపల్లి శ్రావణ్‌కుమార్‌ (26) కొంతకాలంగా ప్రేమించుకొంటున్నారు. శ్రావణ్‌ ఆంధ్రా యూనివర్సిటీలో హెచ్‌ఆర్‌ చదువుతున్నాడు. ఇటీవల సంక్రాంతి సెలవులకు గ్రామానికి వచ్చిన శ్రావణ్‌కు పద్మజకు వేరే వారితో పెళ్లి నిశ్చయమైందని తెలియడంతో మనస్థాపానికి గురయ్యాడు. పద్మజకు తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం ఇష్టపడకపోవడంతో తోటపల్లి ప్రాజెక్టు వద్ద నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న శ్రావణ్‌ పార్వతీపురం–కొమరాడ మధ్యన రైలు కింద పడి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పద్మజ మృతదేహం తోటపల్లి ప్రాజెక్టులో శనివారం లభించింది. స్థానిక పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్న ట్రైనీ డీఎస్పీ తెలిపారు.

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
ఎదిగొచ్చిన పిల్లలు చనిపోవడంతో ఇరు కుటుంబాల వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రేమ వ్యవహారం తెలిసి ఉంటే పెళ్లిచేసేవారమంటూ విలపిస్తున్నారు. వాస్తవం చెప్పకుండా ప్రాణం తీసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదం అలముకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement