మొక్కుబడి సదస్సులు
● నామమాత్రంగా రెవెన్యూ సదస్సులు ● మళ్లీ అధికారుల చుట్టూ అర్జీదారుల ప్రదక్షిణ
సాక్షి, పార్వతీపురం మన్యం:
‘సాలూరు మండలం తోనాం గ్రామానికి చెందిన పూజారి జగదీశ్వరరావు.. తమ ప్రాంతంలో భూసర్వే చేపట్టలేదని, అధికారులు స్పందించి రీసర్వే చేయాలని విజ్ఞప్తి చేశారు.’
●పాచిపెంట మండలం గడివలసకు చెందిన లెంక దాలినాయుడు.. కర్రివలస గ్రామం సర్వే నంబర్ 189–2లో తనకు చెందిన 1.26 ఎకరాల స్థలం వేరే పేరున 1బీ ఇచ్చారని, దాన్ని సవరించి తన భూమి ఇప్పించాలని కోరారు.
●గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర గ్రామానికి చెందిన ఎం.పున్నాలమ్మ ఖాతా నంబర్ 591 సుంకి గ్రామ రెవెన్యూ దాఖలలో ఉన్న భూమిని జిరాయి తీ భూమిగా మార్చాలని దరఖాస్తు అందజేశారు.
●మక్కువ మండలం దుగ్గేరు గ్రామానికి చెందిన ఎం.లక్ష్మణకు సంబంధించిన భూమిని వేరే వారు ఆక్రమించుకున్నారని, ప్రభుత్వం వారు సర్వే చేసి తన భూమిని అప్పగించాలని కోరారు.
●మక్కువ మండలం కాశీపట్నం గ్రామానికి చెందిన పి.మరియమ్మ 1970 సంవత్సరం నుంచి సాగు చేసుకున్న భూమికి పాస్ పుస్తకం మంజూరుచేయాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సమస్యలన్నీ రెవెన్యూపరమైనవే.. కొద్ది రోజులుగా పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అధికారులకు వచ్చిన వినతులే. ‘మీ సొంత గ్రామంలోనే.. మీ సమక్షంలోనే ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తాం. భూ సంబంధిత సమస్యల కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. ఎవరూ జిల్లా కేంద్రం వరకూ వచ్చి అధికారుల కు వినతులు ఇవ్వాల్సిన అవసరం లేదు.’ అంటూ రెవెన్యూ సదస్సులు సందర్భంగా ప్రజాప్రతినిధు లు, అధికారులు చెబుతున్నారు. ఓ వైపు సదస్సులు జరుగుతున్నా.. మరో వైపు భూ సంబంధిత అంశాలపై అధికారులకు యథాతథంగా వినతి పత్రాలు వస్తుండడం.. సదస్సుల తీరుపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
ప్రచారానికే పరిమితం
రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం.. చివరికి వాటిని మొక్కుబడి తంతుగా మార్చేసింది. జిల్లాలో ప్రజల నుంచి వేలల్లో ఫిర్యాదులు అందుతున్నా.. పరిష్కారం అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో బాధితులు ఉసూరుమంటూ తిరిగి కలెక్టరేట్‌లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికలకు అవే సమస్యలతో పోటెత్తుతున్నారు. 900కు పైగా గ్రామాల్లో సదస్సులు నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు సుమారు 713 గ్రామాల్లో పూర్తి చేశారు. ప్రజల నుంచి 4,666 అర్జీలు వచ్చాయి. వాస్తవానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన భూ సంస్కరణలను నిలిపివేసిన కూటమి ప్రభుత్వం.. వాటిపై విషం చిమ్మేందుకే ఈ సదస్సులను చేపట్టిందన్న విమర్శ లు ఉన్నాయి. ల్యాండ్ టైట్లింగ్ చట్టం, భూముల రీ సర్వే, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పన, చుక్కల భూములకు పరిష్కారం లాంటి అన్ని భూ సంబంధిత అంశాలనూ వివాదమయం చేసి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని భావించింది. ప్రధానంగా రీసర్వే అనేది పెద్ద తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేయాలని అనుకుంది. క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు ఈ అంశమై ఆశించిన స్థాయి లో రాకపోవడం.. ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ కావడంతో సదస్సులను మొక్కుబడిగా కానిస్తోంది.
ప్రజల నుంచి స్పందన కరువు..
జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాల్లోనూ రెవెన్యూ సదస్సులను తూతూమంత్రంగా నిర్వహిస్తుండడంతో స్థానికుల భాగస్వామ్యం పెద్దగా ఉండడం లేదు. మొదట్లో ప్రజల నుంచి స్పందన ఉన్నా.. పరిష్కారం మీద నమ్మకం కలగకపోవడతో ప్రస్తుతం 10, 20 మంది కూడా రావడం లేదు. ఈ సభలను అధికారులు కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదు. షెడ్యూల్ ప్రకారం గ్రామాల్లో ఎలాగోలా నిర్వహించి మమ అనిపిస్తున్నారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు
రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సులు, పల్లెనిద్ర, ప్రజా సమస్యల పరిష్కార వేది క తదితర అంశాలపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సమీక్షించారు. పీఎంఏవై 2.0లో గృహ అవసరాలు ఉన్నవారిని గుర్తించి మంజూరు చేయాల న్నారు. ఫిబ్రవరి నెలాఖరుకు 5వేల గృహాలు పూర్తి చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న పీఎం జన్‌మాన్ పనులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఈ నెల 7 వరకు ఎస్సీ కుల ఆడిట్‌లో వచ్చిన అభ్యంతరాలను స్వీకరించాలని కోరారు. పల్లెనిద్ర, గ్రామ దర్శిని కార్యక్రమాల్లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం శనివా రం నుంచి జిల్లాలోని జూనియర్ కళాశాలలో అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పలు శాఖాధికారులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని గరుగుబిల్లి మండల తహశీల్దార్ పి.బాల అన్నారు. కొంకడి వరంలో శుక్రవారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు. జేఎల్‌పీ, అడంగల్, 1బీలపై పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. ఇనామ్ భూముల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో క్రయవిక్రయాలు చేసుకోలేకపోతున్నామని రైతులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎ.అప్పలనాయుడు, హెచ్‌డీటీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment