ఆరోగ్య ఆసరాకు మంగళం..!
● విజయనగరం పట్టణానికి చెందిన జె.రవికుమార్ ఈ నెల 4వ తేదీన ప్రాంకియాటీస్ వ్యాధితో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరాడు. ఈ నెల 7వ తేదీన డిశ్చార్జ్ అయ్యాడు. ఇతనికి ఆరోగ్య ఆసరా కింద రూ. 3,375 రావాలి.
● విజయనగరంలోని కొత్త మజ్జిపేటకు చెందిన జి.సూర్యనారాయణ 2024 డిసెంబర్ 19వ తేదీన కంటి శస్త్రచికిత్స కోసం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరాడు. ఇతను కంటి శస్త్రచికిత్స అనంతరం డిసెంబర్ 21న డిశ్చార్జ్ అయ్యాడు. ఇతనికి రూ.1575 ఆరోగ్య ఆసరా కింద రావాల్సి ఉంది.
● ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు మీసాల పెంటమ్మ. ఈమెది గరివిడి మండలం కె.పాలవలస గ్రామం. ఈమెకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో 2024 డిసెంబర్ 28వ తేదీన ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేరింది. చికిత్స అనంతరం శనివారం డిశ్చార్జ్ అయింది. ఈమెకు రూ.30 వేలు ఆరోగ్య ఆసరా క్రింద రావాల్సి ఉంది. అయితే ఆరోగ్య ఆసరా నిధులు ఇవ్వకపోవడంతో ఈమెకు ఆసరా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
● ఆసరా లబ్ధిదారులకు నిధులు విడుదల చేయని కూటమి సర్కార్
● జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రోగి డిశార్జి అయిన 48 గంటల్లో ఆసరా చెల్లింపు
● రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఆసరా బకాయిలు
వాస్తవమే..
ఆరోగ్య ఆసరా నిధులు విడుదల కొంత కాలంగా విడుదల కాని మాట వాస్తవమే.. ఈ విష యమై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది.
– డాక్టర్ కొయ్యాన అప్పారావు,
ఆరోగ్యశ్రీ ఇన్‌చార్జి కో ఆర్డినేటర్
●
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో వేలాది మంది ఆరోగ్య ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ (ఎన్‌టీఆర్ వైద్య సేవ), ఆరోగ్య ఆసరా పథకాల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం స్థానంలో బీమా కంపెనీ తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆరోగ్య ఆసరా పథకానికి అయితే నిధులు విడుదల చేయడం లేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిధులు విడుదల చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య ఆసరా పథకానికి కూటమి సర్కార్ మంగళం పాడేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందువల్ల నిధులు విడుదల చేయకుండా కూటమి సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందనే విమర్శలొస్తున్నాయి.
గతంలో 48 గంటల్లో ఆసరా చెల్లింపు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం కింద ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలు, చికిత్స చేసుకున్న వారికి చికిత్స అనంతరం భృతి చెల్లించారు. రోగి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో రోగి బ్యాంకు ఖాతాకు ఆసరా చెల్లించేవారు. శస్త్రచికిత్సగాని, చికిత్స చేయించుకోవడం వల్ల వారు కొన్ని నెలల పాటు ఎటువంటి పని చేయలేరు. ఇటువంటి తరుణంలో వారికి ఎటువంటి ఉపాధి ఉండదు. ఈ తరుణంలో కుటుంబ పోషణతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోవడం కోసం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆరోగ్య ఆసరా కోసం భృతిని చెల్లించేది.
1619 వ్యాధులకు విశ్రాంత భృతి
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 1619 వ్యాధులకు ఆరోగ్య ఆసరా పథకాన్ని వర్తింపజేసేవారు. ఈ పథకంలో భాగంగా ఆపరేషన్ కోసం రోగి చేరిన వెంటనే ఆరోగ్యమిత్ర రోగి బ్యాంక్ అకౌంట్ నంబరును రిజిస్టర్ చేసేవారు. ఆసరా రాకపోవడం వల్ల ఇప్పడు బ్యాంక్ వివరాలు తీసుకోవడం మానేసారనే తెలుస్తోంది.
వేలాది మంది ఎదురుచూపులు
జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు 33 ఉన్నాయి. వీటిల్లో నిత్యం అధిక సంఖ్యలో రోగులు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేరి చికిత్స చేయించుకుంటారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స, శస్త్రచికిత్స చేసుకున్న వారికి గత 6 నెలలుగా ఆసరా డబ్బులు కావడం లేదు. ఆరోగ్య ఆసరా కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు. సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఆసరా డబ్బులు రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment