రీ సర్వేలో డాక్యుమెంట్లు పక్కాగా విచారించాలి
పార్వతీపురంటౌన్: రీసర్వే పనుల్లో డాక్యుమెంట్లను పక్కాగా విచారణ చేపట్టాలని పార్వతీపురం సబ్‌కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. పార్వతీపురం మండలంలోని గోపాలపురం గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించి రీ సర్వే పనులను తనిఖీచేశారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే చేపడుతున్న గ్రామాల్లో ముందుగా సమాచారం అందించాలని, తగు రసీదులు పొందాలని స్పష్టం చేశారు. భూముల రీ సర్వేలో తలెత్తిన లోపాలను భూ యజమానికి ముందుగా నోటీసులో అందించాలని, తద్వారా తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివాదాస్పద భూములకు సంబంధించిన వివరాలు ఆయా రిజిస్టర్లలో నమోదు చేయాలని చెప్పారు. రీసర్వేలో ఎక్కడా లోపాలు ఉండరాదని అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రీ సర్వే తర్వాత తప్పులు లేని భూ రికార్డులు నెలకొల్పాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవం
Comments
Please login to add a commentAdd a comment