జైవిక్ ఇండియా అవార్డు గ్రహీతకు అభినందనలు
పార్వతీపురం: జైవిక్ ఇండియా అవార్డు గ్రహీత ఆరిక రవీంద్రను కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ శుక్రవారం అభినందించారు. కలెక్టర్‌ను రవీంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నవారికి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ జైవిక్ ఇండియా అవార్డులను ప్రదానం చేస్తోంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, ఎంపెడా(ఏపీఈడీఏ) సౌజన్యంతో ఇంటర్నేషనల్ కాంపిటేషన్స్ సెంటర్‌ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ సంస్థ అవార్డులను ప్రకటిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆరుగురికి అవార్డులు రాగా అందులో సీతంపేట మండలం దుగ్గి గ్రామానికి చెందిన ఆరిక రవీంద్ర ఒకరు. ఆయన నాలుగు ఎకరాల్లో మూడు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తుండగా గత రెండేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయం దిశగా వరి, పసుపు, చిరు ధాన్యాలు, అపరాలు, జీడిలో అంతర పంటలను సాగు చేశారు. గ్రామమంతా ప్రకృతి వ్యవసాయం విధానంలో సాగు చేయాలనే సంకల్పంతో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయన కృషికి ఉత్తమ ప్రకృతి వ్యవసాయం విభాగంలో దక్షిణ జోన్‌లో మొదటి బహుమతి కింద రూ.లక్ష నగదు, జ్ఞాపికను ఈనెల 22న బెంగుళూరులో నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రవీంద్రను అభినందిస్తూ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, అందులో రైతులు భాగస్వామ్యం కావాలని కోరారు. జిల్లాకు చెందిన వ్యక్తికి అవార్డు రావడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రొగ్రాం మేనేజర్ పి.షణ్ముఖరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment