కరీంనగర్‌టౌన్: రాష్ట్రంలో వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా నేటికీ వడ్ల కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం బాధాకరమని, ఈ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, ఆచరణకు పొంతనే లేకుండా పోయిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆదివారం ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 7,572 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం వాటిలో ఇప్పటికే 4,598 కేంద్రాలను తెరిచినట్లు పేర్కొందని, కానీ తమకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క కేంద్రంలోనూ ఇంతవరకు వడ్ల కొనుగోలు ప్రారంభమే కాలేదన్నారు. వడ్ల కుప్పలతో కేంద్రాలన్నీ నిండిపోవడంతో స్థలం లేక ధాన్యం తీసుకొచ్చిన రైతులు రోడ్లపై రాశులుగా పోస్తున్నారని తెలిపారు. దీంతో రైతులకు, వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదన్నారు. కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడ్లు తడిసిపోయాయని, చాలా చోట్ల కోతకు వచ్చిన పంట నీటిపాలైందన్నారు. తక్షణమే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా తడిసిన ప్రతీ గింజను కొనాలన్నారు. అన్ని రకాల వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోసన్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతుల పక్షాన త్వరలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు. అందులో భాగంగా బీజేపీ శ్రేణులు సోమవారం అన్ని మండల కార్యాలయాలకు వెళ్లి తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
జాప్యాన్ని నిరసిస్తూ పార్లమెంట్ పరిధిలో నిరసనలు
నేడు తహసీల్దార్లకు వినతిపత్రాలు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment