కళాకారులకు వేదిక రాజన్న క్షేత్రం
● వచ్చేనెల 18 నుంచి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు
● ఏడు దశాబ్దాలకుపైగా ఎములాడలో ఉత్సవాలు
● ఈనెల 25లోగా దరఖాస్తులకు ఆహ్వానం
వేములవాడ: రాజన్న ఆలయంలో ఏడు దశాబ్దాలుగా సద్గురు శ్రీత్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు, కళాకారుల ప్రదర్శనలు, కూచిపూడి నృత్యాలతో స్వామి వారికి నైవేద్యం సమర్పించడం జరుగుతోంది. ఏటా ఐదు రోజులపాటు జరుపుకునే ఉత్సవాలను ఈసారి వచ్చేనెల 18 నుంచి 22 వరకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. అయితే ఈసారి కళాకారుల నిబంధనల్లో మార్పులు చేశారు. సుప్రసిద్ధ కళాకారులచే శాసీ్త్రయ, భక్తి, సంగీత, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
73 ఏళ్లుగా..
వేములవాడ రాజన్న సన్నిధిలో 73 ఏళ్లుగా నాదబ్రహ్మ, లయబ్రహ్మ, సద్గురు శ్రీత్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఆడంబరంగా నిర్వహిస్తున్నారు. కళలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన వేములవాడలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఇక్కడి చవుటు సాంబయ్యశాస్త్రి స్ఫూర్తితో ప్రారంభమయ్యాయి. 1951లో తిరువయ్యూర్‌కు వెళ్లి స్వయంగా ఉత్సవాలను తిలకించిన సాంబయ్యశాస్త్రి ఆ మరుసటి సంవత్సరమే వేములవాడలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు జరుపుకునేందుకు శ్రీకారం చుట్టారు. 1966లో సుప్రసిద్ధ గాయకుడు స్వర్గీయ ఘంటసాల, ప్రఖ్యాత సంగీత విధ్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, రామకృష్ణ, పీబీ శ్రీనివాస్, ఆనంద్, శోభరాజ్, వేదావతి ప్రభాకర్, బాలకృష్ణ ప్రసాద్, కూచిపూడి నృత్యానికి ఆధ్యులు వేదాంతం సత్యనారాయాణ, రాధేశ్యాం, ప్రపంచ మాండలిన్ మాంత్రికులు శ్రీనివాస్, గాయని జిక్కి, సినీనటి జమున ఉత్సవాల్లో పాల్గొన్నారు.
నిబంధనలు..
● శాసీ్త్రయ సంగీత కచేరీల్లో పాల్గొను కళాకారులు: టాప్ గ్రేడ్, ఏ గ్రేడ్, బీ హైగ్రేడ్, పదేళ్లు వేదికలపై గానం చేసిన అనుభవం ఉండాలి. వాద్య, సోలో కచేరీలు ఇచ్చువారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తుతో జత చేయాలి.
● జూనియర్ సంగీత కచేరీలు ఇచ్చు కళాకారులు: మ్యూజిక్ కోర్సు, మ్యూజిక్ డిప్లొమా, రేడియో బీ హైగ్రేడ్, బీ గ్రేడ్‌లతోపాటు పదేళ్లపాటు వేదికలపై కచేరీలు ఇచ్చిన అనుభవ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
● నాటకాలు, నృత్యాలు ప్రదర్శించే కళాకారులు: 15 ఏళ్లపాటు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చిన అనుభవం ఉండాలి. నృత్య ప్రదర్శనలు ఇచ్చువారు లైవ్ ప్రోగ్రాంలు మాత్రమే అనుమతించబడతాయి.
● హరికథ కళాకారులు: రేడియో గ్రేడ్, టాప్ గ్రేడ్, బీ హైగ్రేడ్ అర్హత కల్గిన మంచి అనుభవం, గతంలో నిర్వహించిన సంస్థల ద్వారా పొందిన ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
ఘనంగా నిర్వహిస్తాం
వచ్చేనెల 18 నుంచి 22 వరకు రాజన్న ఆలయంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు గతంలోకంటే ఘనంగా నిర్వహిస్తాం. స్థానిక కళాకారులకు అవకాశం కల్పిస్తాం. ఈసారి ప్రత్యేక నిబంధనలు ఏర్పాటు చేశాం. వాటికి అర్హత ఉన్న కళాకారులు మాత్రమే ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలి.
– కొప్పుల వినోద్‌రెడ్డి, ఆలయ ఈవో
Comments
Please login to add a commentAdd a comment